మధ్యాహ్నం 2 గంటలకు నీట్ పరీక్ష

మధ్యాహ్నం 2 గంటలకు నీట్ పరీక్ష

ఎంబీబీఎస్, డెంటల్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20గంటల వరకు నీట్ పరీక్ష జరగనుంది. రాష్ట్రంలో 25 పట్టణాల్లోని 115 కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేయగా.. 60వేలమంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో నీట్ రాసేందుకు అవకాశం కల్పించారు. 

పరీక్షా సమయానికి అరగంట ముందే ఎగ్జామినేషన్ సెంటర్ గేట్లు మూసివేయనున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు మధ్యాహ్నం 1.30 గంటల్లోపే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. నీట్ ఎగ్జామ్ ఆఫ్ లైన్ లో జరగనుంది. విద్యార్థులు పరీక్ష హాల్లోకి వెళ్లే ముందే అండర్ టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో నీట్ ఎంట్రెన్స్ కు 3గంటల సమయం ఇచ్చేవారు. 180 నిమిషాల్లో 200 ప్రశ్నలను అర్థం చేసుకుని 180 సమాధానాలు రాయాల్సి వచ్చేది. సమయం సరిపోవడం లేదని విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈసారి 20 నిమిషాల అదనపు సమయం కేటాయించింది.