కృష్ణా ప్రాజెక్టుల గేట్లన్నీ ఖుల్లా

కృష్ణా ప్రాజెక్టుల గేట్లన్నీ ఖుల్లా
  • ఎగువన వానలతో డ్యాముల్లోకి పోటెత్తుతున్న వరద
  • ఏడోసారి తెరుచుకున్న శ్రీశైలం గేట్లు.. 10 ఓపెన్​
  • జూరాల 23 గేట్లు ఎత్తి కిందికి నీటి విడుదల
  • 18 గేట్లు తెరుచుకున్న నాగార్జున సాగర్​

హైదరాబాద్​, వెలుగు:

కృష్ణా బేసిన్​లోని డ్యాములన్నీ మళ్లీ ఖుల్లా అయ్యాయి. పై రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుండడంతో కృష్ణమ్మ పోటెత్తుతోంది. వడివడిగా సముద్రంలో కలిసేందుకు ప్రాజెక్టుల నుంచి కిందకు దూకుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి మొదలుకుని ఏపీలోని పులిచింతల వరకు కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తేశారు. ఆల్మట్టిలోకి 2.11 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 2.5 లక్షల క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. నారాయణపూర్​ నుంచి జూరాలకు 3.65 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 3,84,691 క్యూసెక్కులను గేట్లు, ఇతర పథకాల ద్వారా కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తారు. దిగువ జూరాల, ఎగువ జూరాల్లోని 12 యూనిట్లలో కరెంట్​ ఉత్పాదనకు 20,855 క్యూసెక్కులు, ప్రధాన కుడి కాలువకు 822 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు వెయ్యి, భీమా కాల్వకు 650, సమాంతర కాలువకు 340, నెట్టెంపాడుకు 1,500, కోయిల్​సాగర్​ కాల్వకు 315 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలోని ఉజ్జయిని ప్రాజెక్టుకు  30,347 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తి 60 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. డ్యాం పూర్తి నిల్వ సామర్థ్యమైన 117.24 టీఎంసీల నీళ్లు ఉన్నాయి.

శ్రీశైలం 10.. సాగర్​ 18

ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా మొదలైనా, భారీగా వర్షాలు పడటంతో కృష్ణా బేసిన్​లోని ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది వర్షాకాలంలో రికార్డు స్థాయిలో శ్రీశైలం గేట్లను ఏడోసారి అధికారులు తెరిచారు. 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. జూరాల డ్యామ్‌తో పాటు సుంకేశుల నుంచీ శ్రీశైలానికి భారీగా వరద వస్తోంది. జూరాల నుంచి 3.84 లక్షల ఇన్​ఫ్లో వస్తుండగా, సుంకేశుల నుంచి 1.68 లక్షల వరద వస్తోంది. దీంతో 4 లక్షల క్యూసెక్కుల వరదను స్పిల్​ వే గేట్ల నుంచి కిందకు వదులుతుండగా, మిగతా వరదను వివిధ పథకాలకు విడుదల చేస్తున్నారు. కల్వకుర్తి, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదల కొనసాగుతోంది. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు విద్యుత్​ కేంద్రాల్లో కరెంట్​ను తయారు చేస్తూ 67 వేల క్యూసెక్కులను కిందకు పంపుతున్నారు. ఇటు నాగార్జునసాగర్​ డ్యాం 18 గేట్లను అధికారులు ఎత్తారు. మంగళవారం సాయంత్రమే 2 గేట్లు ఎత్తిన అధికారులు, వరద పెరుగుతుండడంతో ఒక్కో గేట్​ను ఎత్తుతూ అవుట్​ఫ్లోను పెంచారు. సాగర్​కు 4,47,455 క్యూసెక్కుల వరద వస్తోంది. కుడి కాల్వకు 6,766 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 2,557 క్యూసెక్కులు, ఎస్​ఎల్​బీసీ 2,400 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్​ కేంద్రం నుంచి 31,830 క్యూసెక్కులను వదులుతున్నారు. మొత్తంగా 4,34,913 క్యూసెక్కుల నీటిని కిందకు పంపుతున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో శివాలయం ఘాట్​ దగ్గరకు ఎవరూ వెళ్లకుండా అధికారులు తాళ్లు కట్టారు. గత ఆగస్టులో ఓ వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాళ్లను కట్టారు.

ఎస్సారెస్పీ బంద్​

రెండు రోజుల పాటు శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​ (ఎస్సారెస్పీ) గేట్ల పై నుంచి దూకిన గోదావరి ప్రవాహం ఆగిపోయింది. బుధవారం సాయంత్రం 7 గంటల వరకు పోచంపాడులోకి 8 వేల క్యూసెక్కుల వరద మాత్రమే వస్తుండడంతో, శ్రీరాంసాగర్​ మొత్తం గేట్లను అధికారులు మూసేశారు. ఎస్కేప్​ గేట్ల ద్వారా మాత్రమే 2,500 క్యూసెక్కుల నీళ్లను కిందకు వదులుతున్నారు. కాకతీయ కాలువకు 5,500 క్యూసెక్కుల నీటిని వదులతున్నారు. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వ ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 94,398 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా 14 గేట్లు ఎత్తి 1,02,120 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. ఈ ప్రాజెక్టులో 20.17 టీఎంసీలకు గానూ 19.75 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఎల్​ఎండీలోకి 4,774 క్యూసెక్కుల వరద వస్తోంది. 1,102 క్యూసెక్కులను కాలువకు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టులో 24.07 టీఎంసీలకు 18.70 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. కడెం ప్రాజెక్టుకు 850 క్యూసెక్కుల ఇన్​ ఫ్లో వస్తుండగా, కాలువల ద్వారా 858 క్యూసెక్కులు వదులుతున్నారు. 7.60 టీఎంసీలకు గానూ 7.48 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి.