
హైదరాబాద్, వెలుగు : కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల గేట్లన్నీ మరోసారి ఓపెన్ చేశారు. కర్నాటకలోని ఆల్మట్టి నుంచి భారీగా వరద కొనసాగుతోంది. ఏపీలోని ప్రకాశం బ్యారేజీని దాటుకొని లక్షల క్యూసెక్కుల నీళ్లు బంగాళాఖాతంలో చేరుతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మోస్తారుకు మించి వరద వస్తుండటంతో గేట్లు ఎత్తి నీటిని వదిలేస్తున్నారు. ఎల్లంపల్లికి వరద పెరిగింది.
ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, శబరి నదుల నుంచి వరద వచ్చి గోదావరిలో చేరుతోంది. దీంతో ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు, తుపాకులగూడెం, దుమ్ముగూడేన్ని దాటుకొని వరద ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి చేరుతోంది. నారాయణపూర్, తుంగభద్ర, ఉజ్జయిని, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులించితల ప్రాజెక్టులకూ వరద వస్తోంది.