దూద్ కా దూద్.. పానీ కా పానీ..! : కారును తకరారు పెట్టే వ్యూహం

దూద్ కా దూద్.. పానీ కా పానీ..! : కారును తకరారు పెట్టే వ్యూహం
  • కాంగ్రెస్ కు కామ్రేడ్లు, టీజేఎస్, వైఎస్సార్టీపీ బాసట
  • పోటీ చేయకుండా టీడీపీ హెల్పింగ్ హ్యాండ్
  • గులాబీకి బాసటగా నిలిచిన పతంగ్ పార్టీ
  • జనసేన, కమలం పార్టీ రూటే సెపరేటు
  • తేలిన అసెంబ్లీ ఎలక్షన్ –2023 ముఖచిత్రం

హైదరాబాద్: గులాబీ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. కారును ఓడించే శక్తి ఉన్న కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలుస్తున్నాయి. నాలుగైదు నెలలుగా చోటు చేసుకున్న వరుస  పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద హైప్ తెచ్చాయి. కర్నాటక ఫలితాలు ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాయి. అంతకు ముందు ఊపుమీదున్న కాషాయ సేన రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో వెనుకబడింది. ఈ పరిణమాల నేపథ్యంలో బీఆర్ఎస్ ను ఓడించే శక్తి కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉన్నదన్న నమ్మకం అటు ప్రజల్లో, ఇటు రాజకీయ పార్టీల్లో నెలకొంది. దీంతో ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తున్నాయి. కుటుంబ, అవినీతి పాలన అంతమే లక్ష్యంగా పని  చేస్తామని ప్రకటిస్తున్నాయి. మొన్నటి వరకు 119 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించి టీడీపీ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందనే భావనతోనే తెలంగాణ అసెంబ్లీ బరిలో నిలవడం లేదని తెలుస్తోంది.  షర్మిల నాయకత్వంలో కేసీఆర్ అవినీతిపై పోరాడుతున్న వైఎస్సార్ టీపీ కూడా కాంగ్రెస్ లో విలీనం అయ్యేందుకు ప్రయత్నించింది. పరిస్థితులు అంతగా అనుకూలించకపోవడంతో ఒంటరి పోరుకు రెడీ అని ప్రకటించింది. ఆశావహుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించింది. చివరి క్షణంలో కాంగ్రెస్ కు మద్దతుగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. తమ లక్ష్యం దొరను గద్దె దించడమేనని షర్మిల ప్రకటించారు. నాలుగేసి సీట్ల కోసం పట్టుబట్టిన  కామ్రేడ్లు మెత్తబడ్డారు. అడ్జెస్ట్ మెంట్ మెథడ్ కు రెడీ అవుతున్నారు. కొత్తగూడెం స్థానాన్ని పొత్తులో కేటాయించడంతోపాటు ఒక ఎమ్మెల్సీ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రతిపాదనకు సీపీఐ ఓకే చెప్పింది. సీపీఎం ప్రధానంగా పాలేరు స్థానం కోసం బెట్టు చేస్తోంది. కాంగ్రెస్ పొత్తుల అంశం తేల్చకపోవడంతో 14 స్థానాలకు అభ్యర్థులనే ప్రకటించింది. అయితే నిన్న రాత్రి  సీపీఎం ప్రధాన కార్యదర్శి  సీతారాం ఏచూరి, ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణలో పొత్తులపై చర్చించారు. దీనిపై సీతారాం ఏచూరి తమ్మినేని వీరభద్రంతో మాట్లాడినట్టు తెలుస్తోంది. సీపీఎం సైతం కాంగ్రెస్ తో దాదాపు జట్టుకట్టే అవకాశం ఉంది. నాలుగు సీట్లు ఇవ్వాలని కోరిన తెలంగాణ జనసమితి.. ఏ సీటూ ఇవ్వకున్నా సరేనని ఒప్పుకుంది. కేసీఆర్ నియంతృత్వ పాలన అంతానికి కలిసి పనిచేస్తామని  స్నేహహస్తం అందించింది. 

బీఆర్ఎస్ తో ఎంఐఎం దోస్తీ

అధికార బీఆర్ఎస్, ఎంఐఎంకు మిత్ర పక్షంగా నిలుస్తోంది. 119 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినా.. పాతబస్తీలో ఫ్రెండ్లీ కంటెస్ట్ మాత్రమే. చాలా స్థానాల్లో కేవలం పేరుకు మాత్రమే గులాబీ అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. పాతబస్తీ బయట 15 స్థానాలు గెలుచుకుంటామని గతంలో ప్రకటించిన పతంగ్ పార్టీ దానిని ఆచరణలో పెట్టలేదు.  బీఆర్ఎస్ విజయానికి దోహదపడేందుకు వీలుగా కొన్ని సెగ్మెంట్లలో పోటీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ఓట్లను చీల్చడమే లక్ష్యంగా ఆ పార్టీ స్టెప్ తీసుకుంటోందని సమాచారం. కారు పార్టీ గెలిస్తే స్టీరింగ్  తమ వద్దే ఉంటుందని పదే పదే చెప్తున్న అసదుద్దీన్ అందుకు కావాల్సిన సహకారాన్ని అందిస్తున్నారు. 

కమలం.. అయోమయం..

నాలుగైదు నెలల క్రితం వరకు ఫుల్ జోష్ లో కనిపించిన కమలం పార్టీ వాడిపోతోంది. పాదయాత్రలు లేవు, పంచ్ డైలాగ్ లు లేవు.. సవాళ్లు లేవు.. ప్రతి సవాళ్లు లేవు.. కానీ బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకొనే ప్రయత్నం చేస్తోంది. టికెట్ల కేటాయింపులోనూ ఉదాసీనంగా వ్యవహరించిందనే విమర్శలను మూటగట్టుకుంది కాషాయ సేన. మిత్ర పక్షమైన జనసేనకు సీట్ల కేటాయింపు తలనొప్పిగా మారింది. ఈ పరిణామాలకు కలత చెందిన  పలువురు  సీనియర్ నేతలు సైతం పార్టీని వీడారు. ఇటీవల సూర్యాపేటలో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన బీసీ ముఖ్యమంత్రి ప్రకటనను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. బీజేపీ ప్రకటించిన క్యాండిడేట్ల లిస్టు పేలవంగా ఉందనే చర్చ మరోవైపు సాగుతోంది. కానీ బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అని జనం నమ్మడం లేదంటున్నారు విశ్లేషకులు.