రేపే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక

రేపే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు అన్నిఏర్పాట్లు పూర్తయ్యాయి.137 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అధ్యక్ష ఎన్నికకు ఓటింగ్ జరుగుతుండటం ఇది ఆరోసారి. సోనియా, రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ బరిలో లేకపోవడం వల్ల 24 ఏండ్ల సుధీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ మధ్య పోటీ నెలకొంది. 

9వేల మందికిపైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, పీసీసీ ప్రతినిధులు సోమవారం జరిగే అధ్యక్ష ఎన్నికకు ఓట్లు వేయనున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో, ఏఐసీసీ కార్యాలయంలో, భారత్ జోడో యాత్ర క్యాంప్ లో కూడా పోలింగ్ జరగనుంది. భారత్ జోడో యాత్ర క్యాంప్ లో రాహుల్ సహా..ముఖ్యనేతలంతా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రతి రాష్ట్రానికి ఒక రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా పలువురు నేతలను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఎంపిక చేసింది. తెలంగాణకు రిటర్నింగ్ అధికారిగా రాజమోహన్ ఉన్నితన్, ఢిల్లీకి రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యవహరిస్తున్నారు. 

రేపు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల అథారిటీ చైర్మన్ మిస్త్రి తెలిపారు. ఓటు వేసే వ్యక్తులు మద్దతిచ్చే వ్యక్తికి టిక్ మార్క్ సూచించాలన్నారు. పోలింగ్ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మిస్త్రి. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ రేపు ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఓటు వేస్తారన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్రలో ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.