నిండు కుండలా తెలంగాణ ప్రాజెక్టులు .. వివరాలివే..​

నిండు కుండలా తెలంగాణ ప్రాజెక్టులు .. వివరాలివే..​
  •     ఆగస్టు రెండో వారం నాటికే నిండిన కృష్ణా బేసిన్​
  •     గోదావరి బేసిన్​కు పోటెత్తుతున్న వరద
  •     శ్రీరాంసాగర్​కు 3.05 లక్షల క్యూసెక్కులు..ఎల్లంపల్లికి 3.39 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో
  •     ఫుల్​ కెపాసిటీకి చేరుకున్న నిజాంసాగర్​, సింగూరు
  • పైనుంచి వరద..  దిగువకు నీటి విడుదల

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారాయి. మధ్యతరహా ప్రాజెక్టుల నుంచి భారీ ప్రాజెక్టుల వరకు అన్నింట్లో జలకళ సంతరించుకుంది. కృష్ణా బేసిన్​లోని ప్రాజెక్టులు గత నెలలోనే నిండగా.. ఇప్పుడు గోదావరి బేసిన్​లోని శ్రీరాంసాగర్​ సహా ప్రధాన ప్రాజెక్టులు వరద పోటుతో ఫుల్​ అయ్యాయి. ప్రస్తుతం కృష్ణా బేసిన్​లో వరద తగ్గుముఖం పట్టినా.. గోదావరి బేసిన్​లో మాత్రం వరద తీవ్రత ఎక్కువగానే ఉంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కృష్ణా నదికి వరద ప్రవాహం తగ్గడంతో నాగార్జునసాగర్​, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను క్లోజ్​ చేశారు. 

పోయిన నెలలోనే నిండిన కృష్ణా బేసిన్​

ఆగస్టు రెండోవారం నాటికే కృష్ణా బేసిన్​లోని ప్రాజెక్టులు నిండాయి. ఎగువన కురిసిన వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. దీంతో ప్రాజెక్టులు అనుకున్న దానికన్నా వేగంగా ఫుల్​ కెపాసిటీకి చేరాయి. ఆగస్టు ఫస్ట్​ వీక్​లోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండగా.. రెండో వారంలో నాగార్జునసాగర్​ ప్రాజెక్టు ఫుల్​ కెపాసిటీకి చేరుకుంది. ప్రస్తుతం ఆల్మట్టి, నారాయణపూర్​ జలాశయాల గేట్లను మూసేశారు.  జూరాల ప్రాజెక్టుకు భీమా నదిపై కట్టిన సన్నతి బ్యారేజీ (కర్ణాటక) నుంచి మొన్నటిదాకా వచ్చిన వరద కూడా తగ్గుముఖం పట్టింది. 

ప్రస్తుతం జూరాలకు 1.28 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 1.37 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 1.54 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్​ నమోదవుతున్నది. దిగువకు 90,244 క్యూసెక్కులను రిలీజ్​ చేస్తున్నారు. నాగార్జునసాగర్​ ప్రాజెక్టుకు 39 వేల స్వల్ప ప్రవాహాలు రికార్డవుతున్నాయి. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు ఫుల్​ కెపాసిటీ 9.66 టీఎంసీలకు గానూ 8.81 టీఎంసీల నిల్వ ఉన్నది. శ్రీశైలం ప్రాజెక్టు 215.81 టీఎంసీల కెపాసిటీకి గానూ 209.59 టీఎంసీలతో నిండుకుండలా ఉన్నది. నాగార్జునసాగర్​ ప్రాజెక్టులో 312.05 టీఎంసీలకుగానూ 304.47 టీఎంసీల నీళ్లున్నాయి. 

కళకళలాడుతున్న గోదావరి

గోదావరి బేసిన్​లోని ప్రాజెక్టులు కూడా ప్రస్తుతం జలకళ సంతరించుకున్నాయి. ఇటీవలి భారీ వర్షాలతో ఈ ప్రాజెక్టులకు భారీ వరద కొనసాగుతున్నది. ఎగువన వర్షాలుండడంతో గోదావరికి వరద పోటెత్తుతున్నది. శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు 3.05 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్​ వస్తుండగా.. 3.58 లక్షల క్యూసెక్కులను కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 75.31 టీఎంసీల నిల్వ ఉన్నది. వారం కిందటి వరకు నీళ్లు లేక ఎండిపోయిన సింగూరు, నిజాంసాగర్​ ప్రాజెక్టులూ ప్రస్తుతం జలకళను సంతరించుకున్నాయి. 

ఆ ప్రాజెక్టులు కూడా పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరువలో ఉన్నాయి. సింగూరుకు 44 వేలు, నిజాంసాగర్​కు 28 వేల క్యూసెక్కుల చొప్పున వరద వస్తున్నది. కడెం ప్రాజెక్టుకు 8,815 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. కడెం ప్రాజెక్టులో ప్రస్తుతం 7.6 టీఎంసీలకుగానూ 6.52 టీఎంసీల నిల్వ ఉన్నది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 3.39 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. దీంతో ఆ ప్రాజెక్టు నుంచి 2.40 లక్షల క్యూసెక్కుల నీటిని రిలీజ్​ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 20.175 టీఎంసీలకు గానూ 13.67 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. 

Also Read :- తెలంగాణలో మరో 4 రోజులు భారీ వర్షాలు

ఎగువ నుంచి భారీ వరదలు వస్తుండడంతో ప్రాజెక్టులో క్యుషన్​ పెడుతున్నారు. మేడిగడ్డ వద్ద 8.03 లక్షలు, సమ్మక్కసాగర్​ వద్ద 7.11 లక్షలు, సీతమ్మసాగర్​ వద్ద 9.54 లక్షల క్యూసెక్కుల వరదను వదిలేస్తున్నారు. దీంతో భద్రాచలం వద్ద 45.55 మీటర్ల ఎత్తులో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. 8.79 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. అక్కడ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 

మీడియం ప్రాజెక్టులూ నిండుకుండల్లా..

గోదావరి, కృష్ణా బేసిన్​లోని మీడియం ప్రాజెక్టులు కూడా నిండుకుండల్లా మారాయి. డిండి, మూసీ, పాకాల, కోటిపల్లి వాగు, వైరా, లంకాసాగర్​ వంటి మధ్య తరహా ప్రాజెక్టులన్నీ మొన్నటి వరదలకు ఫుల్​ రిజర్వాయర్​ లెవెల్​కు చేరాయి. గోదావరి బేసిన్​లోని ప్రధానమైన మీడియం ప్రాజెక్టులన్నీ ఫుల్​ అయిపోయాయి. అప్పర్​మానేరు ప్రాజెక్టు ఫుల్​ కెపాసిటీకి చేరింది. 

నల్లవాగు, సాత్నాల, మత్తడివాగు, స్వర్ణ, వట్టివాగు, గడ్డెన్నవాగు, ఎన్టీఆర్​ సాగర్​, కుమ్రంభీం ప్రాజెక్ట్​, పెద్దవాగు, గొల్లవాగు, నీల్వాయి, రాళ్లవాగు, బొగ్గులవాగు, లక్నవరం లేక్​, రామప్ప లేక్​, పాలెం వాగు ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులకు ఇంకా వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ఆయా ప్రాజెక్టులూ పూర్తి సామర్థ్యంతో కళకళలాడుతున్నాయి.

ప్రస్తుతం ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వ, వరద వివరాలు

ప్రాజెక్టు​    సామర్థ్యం    ప్రస్తుత నిల్వ    ఇన్​ఫ్లో    ఔట్​ఫ్లో
    (టీఎంసీ)    (టీఎంసీ)    (క్యూసెక్కులు)    (క్యూసెక్కులు)

  • ఆల్మట్టి    129.72    127.47    30,000    30,000

  • నారాయణపూర్    37.64    37.06    20,000    17,600

  • జూరాల    9.66    8.81    1,28,000    1,37,218

  • తుంగభద్ర    105.79    101.46    39,945    15,533

  • శ్రీశైలం    215.81    209.59    1,54,527    90,244

  • నాగార్జునసాగర్    312.05    304.47    39,694    39,694

  • సింగూరు    29.917    25.89    44,289    00

  • నిజాంసాగర్    17.800    15.81    28,000    00

  • శ్రీరాంసాగర్​    80.500    75.31    3,05,692    3,58,524

  • కడెం    7.600    6.52    8,815    676

  • శ్రీపాద ఎల్లంపల్లి    20.175    13.67    3,39,782    2,40,560

  • మేడిగడ్డ    16.170    00    8,03,370    8,03,370

  • సమ్మక్కసాగర్    6.940    00    7,11,370    7,11,370

  • సీతమ్మసాగర్​    36.570    00    9,54,431    9,54,43