అసెంబ్లీకి వెళ్లే దారులన్నీ జామ్

అసెంబ్లీకి వెళ్లే దారులన్నీ జామ్

హైదరాబాద్, వెలుగు : సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం రోజు ప్రదర్శించిన నిర్లక్ష్యాన్నే అధికారులు శనివారం తొలి అసెంబ్లీ సెషన్​ జరుగుతున్నప్పుడూ రిపీట్​ చేశారు. ట్రాఫిక్​ నియంత్రణలో చేతులెత్తేయడంతో అసెంబ్లీకి వెళ్లే దారులన్నీ జామ్ అయ్యాయి.  కనీసం టూ వీలర్లు కూడా కదిలే పరిస్థితి లేకపోయింది. గాంధీభవన్, కొత్త సెక్రటేరియెట్, ఖైరతాబాద్, బషీర్​బాగ్​ ఫ్లై ఓవర్​ నుంచి అసెంబ్లీకి వెళ్లే దారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఈ ట్రాఫిక్​ జామ్ కారణంగానే అసెంబ్లీ సమావేశాలు పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ట్రాఫిక్​ జామ్​పై సీఎం రేవంత్​రెడ్డి సీరియస్​ అయినట్టు తెలిసింది. పార్టీ  శ్రేణుల ద్వారా ప్రజల ఇబ్బందులను తెలుసుకున్న ఆయన.. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకున్నారంటూ అధికారులను ప్రశ్నించినట్టు సమాచారం.  

ఐడీలు చూడకుండానే..

సాధారణంగా అసెంబ్లీ సమావేశాల టైమ్​లో లీడర్లతోపాటు అధికారులు, జర్నలిస్టులు, అనుమతి ఉన్న విజిటర్లను ఐడీ కార్డులు చెక్​ చేసి లోపలికి పంపుతుంటారు. కానీ, శనివారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఐడీ కార్డులను చూడకుండా.. కేవలం వాహనాల పాస్​లుంటే అనుమతించారు. ఇంతకుముందు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండేది. ఇప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వీఐపీ మూమెంట్స్​ఉన్నా..

సభలు, సమావేశాలు, అసెంబ్లీ, శోభాయాత్ర వంటివి జరుగుతున్నప్పుడు పోలీసులు కామన్​గా కొన్ని ట్రాఫిక్​ ఆంక్షలను పెడుతుంటారు. వీఐపీ మూమెంట్స్​ ఉన్నప్పుడు కూడా వారి రాకను, వారు వచ్చే సమయాన్ని బట్టి కొన్ని చోట్ల ట్రాఫిక్​ను దారి మళ్లిస్తుంటారు. అయితే, ప్రమాణ స్వీకారం రోజు గానీ, అసెంబ్లీ తొలి సెషన్​ నిర్వహణ సమయంలోగానీ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా ట్రాఫిక్​ నియంత్రణలో ఫెయిలయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. వాస్తవానికి వీఐపీ మూమెంట్స్​ఉన్నప్పుడు సామాన్యుల వాహనాలను అనుమతించరు. కానీ, ఇక్కడ వీఐపీ కాన్వాయ్​లతో పాటు సామాన్యుల వెహికల్స్​నూ అనుమతించారు. 

ప్రమాణ స్వీకారం రోజు సోనియా, రాహుల్, రేవంత్​ వెళ్తున్న కాన్వాయ్​తోపాటే సామాన్యుల వాహనాలనూ వదిలేయడంతో సమస్య ఏర్పడింది.  శనివారం గాంధీభవన్​లో సోనియా గాంధీ జన్మదిన వేడుకల అనంతరం రేవంత్​ రెడ్డి బయల్దేరేటప్పుడు అలాంటి పరిస్థితే కనిపించింది. కేసీఆర్​ హయాంలో కట్టుదిట్టంగా వ్యవహరించిన అధికారులు.. ఇప్పుడెందుకు కాడి వదిలేసి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.