ఆ కుటుంబ బాణాలన్నీ బీజేపీ వదిలినవే

ఆ కుటుంబ బాణాలన్నీ బీజేపీ వదిలినవే

షర్మిల బీజేపీ బాణమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. వైఎస్ అంటేనే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే వైఎస్ అన్న జగ్గారెడ్డి... షర్మిలకు ట్రైనింగ్ ఇచ్చేది ఎవరో సరిగ్గా ఇవ్వండని సెటైర్ వేశారు. బీజేపీని, మోడీని ఎందుకు తిడ్తలేవు షర్మిల... నోరు అదుపులో పెట్టుకో.. వైఎస్ పరువు తీయకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.హైదరాబాద్ లో వున్న సెటిలర్స్ ఓట్లు కాంగ్రెస్ కు వెళ్లకుండా బీజేపీ డైరెక్షన్లో షర్మిల పని చేస్తోందని ఆరోపించారు. ఆంధ్ర ఓట్లను చీల్చడానికి షర్మిలను రంగంలోకి దింపారన్న ఆయన.. వైఎస్ విజయమ్మ కూడా బీజేపీ డైరెక్షన్ లోనే పనిచేస్తోందని చెప్పారు. ఆ కుటుంబ బాణాలన్నీ బీజేపీ వదిలినవేనని విమర్శించారు. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా కుట్ర చేస్తున్నారన్న జగ్గారెడ్డి.. బీజేపీ వ్యూహంలో పావులే వైఎస్ కుటుంబమని ఆరోపణలు చేశారు.

నేను ఏ పార్టీలో ఉంటే నీకెందుకు..?

అయినా తాను ఏ పార్టీలో ఉంటే నీకెందుకు షర్మిల అంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు. నేతలను తిట్టేందుకే షర్మిల పాదయాత్ర చేస్తోందని, ఆమెకు అసలు రాజకీయాలపై అవగాహన లేదని విమర్శించారు. షర్మిలనే బాణాలు మార్చినపుడు మేం అనకూడదా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షర్మిల, వైఎస్ఆర్ కూతురైతే మాత్రం తిడితే ఊరుకుంటామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ షర్మిల పార్టీ పెట్టుకొని తెలంగాణాలో పర్యటిస్తోందన్న ఆయన.. పార్టీ పెట్టుకున్న లీడర్లు పబ్లిక్ ఇష్యూస్ పై పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. కానీ షర్మిల మాత్రం రాజకీయ విమర్శలకు ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు. వైఎస్ఆర్ తమ నాయకుడని, వైఎస్సార్ వున్నప్పుడు రాహుల్ ను ప్రధానిగా చూడాలని కోరుకున్నాడని ఈ సందర్భంగా జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ లోకి పిలిచింది, పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించింది వైఎస్ఆరే

అన్నాచెల్లెలు బాగానే వుంటున్నారు.. వైఎస్ జయంతి, వర్థంతి రోజున ఇద్దరూ కలిసే శ్రద్ధాంజలి ఘటిస్తున్నారన్న జగ్గారెడ్డి... చెరో బాణంగా బాగానే వున్నారని విమర్శించారు. సంగారెడ్డికి వస్తే పబ్లిక్ ఇష్యూస్ పై మాట్లాడ్డం మానేసి నాపై కామెంట్ చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నానో ప్రజలకు తెలుసని, వైఎస్సార్ ను తిట్టిపించేలా వ్యవహరించకు అంటూ వార్నింగ్ ఇచ్చారు. టీఆర్ఎస్ లో పనిచేస్తుంటే.. తనను కాంగ్రెస్ లోకి పిలిచింది, పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించింది వైఎస్ఆరేనని ఆరోపించారు. ఫస్ట్ నా శీలం ఖరాబ్ చేసింది మీ అయ్యేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి జవాబు చెప్తావా షర్మిళ అంటూ ప్రశ్నించారు. తాను వైఎస్ అభిమానినని.. షర్మిళ ఇదే విధంగా మాట్లాడితే అభిమానులంతా తిడ్తారన్న జగ్గారెడ్డి... వైఎస్ఆర్ చనిపోతే ఆయన కుటుంబ సభ్యులకంటే మా లాంటి అభిమానులే ఎక్కువగా ఏడ్చామన్నారు. వాళ్ళు కుటుంబ సభ్యుల్లో ఎవరు సీఎం కావాలనే ఆలోచనలో వున్నారన్న ఆయన.. తనన గెలికితే బాగోదని, అన్ని విషయాలు బయటపెడతానని హెచ్చరించారు. మీ తండ్రి వైఎస్ కూడా పార్టీలు మారిన విషయం తెలుసుకో అంటూ జగ్గారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.