- 7 వికెట్ల తేడాతో శ్రీలంక ఓటమి
- రాణించిన వైష్ణవి, శ్రీచరణి
విశాఖపట్నం: శ్రీలంకతో టీ20 సిరీస్‌లో ఇండియా అమ్మాయిలు అదరగొడుతున్నారు. ఛేజింగ్‌లో షెఫాలీ వర్మ (34 బాల్స్‌లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 69 నాటౌట్) దంచికొట్టడంతో.. మంగళవారం జరిగిన రెండో టీ20లోనూ ఇండియా 7 వికెట్ల తేడాతో లంకపై గెలిచింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో హోమ్ టీమ్ 2–0 ఆధిక్యం అందుకుంది. టాస్ ఓడిన శ్రీలంక 20 ఓవర్లలో 128/9 స్కోరు చేసింది. హర్షిత సమరవిక్రమ (32 బాల్స్‌లో 4 ఫోర్లతో 33) టాప్ స్కోరర్.
తర్వాత ఇండియా 11.5 ఓవర్లలోనే 129/3 స్కోరు చేసి నెగ్గింది. చిన్న ఛేజింగ్‌లో ఇండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. నాలుగో ఓవర్‌లో స్మృతి మంధాన (14) ఔటైంది. అయితే రెండో ఎండ్‌లో షెఫాలీ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఇక 29/1 స్కోరు వద్ద వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (26) కూడా బ్యాట్ ఝుళిపించింది. ఈ ఇద్దరు బౌండ్రీలు బాదడంతో పవర్‌ప్లేలో ఇండియా 68/1తో నిలిచింది. అయితే 8వ ఓవర్‌లో జెమీమాను ఔట్ చేసిన లంక బౌలర్లు రెండో వికెట్‌కు 58 రన్స్ భాగస్వామ్యాన్ని విడదీశారు.
ఈ క్రమంలో షెఫాలీ 27 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేయగా, ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (10) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. మూడో వికెట్‌కు 41 రన్స్ జోడించి వెనుదిరిగింది. అయినా ఓ ఎండ్‌లో ధాటిగా ఆడిన షెఫాలీ.. రిచా ఘోష్ (1 నాటౌట్)తో కలిసి మరో 49 బాల్స్ మిగిలి ఉండగానే ఈజీగా విజయాన్ని అందించింది. మల్కి, కావ్య, కవిషా తలో వికెట్ పడగొట్టారు. షెఫాలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం తిరువనంతపురంలో మూడో టీ20 జరుగుతుంది.
బౌలర్ల జోరు..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంకను కట్టడి చేయడంలో ఇండియా బౌలర్లు మరోసారి సక్సెస్ అయ్యారు. దీంతో లంక టాపార్డర్ మినహా మిగతా వారు రన్స్ చేయడంలో విఫలమయ్యారు. ఇన్నింగ్స్ ఆరో బాల్‌కే విష్మీ (1)ను క్రాంతి గౌడ్ (1/21) ఔట్ చేయగా, కెప్టెన్ చామరి ఆటపట్టు (31), హాసిని (22), హర్షిత కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు.
ఈ ముగ్గురు కలిసి 102 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. అయితే ఈ దశలో విజృంభించిన ఇండియా బౌలర్లు లోయర్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. వరుస విరామాల్లో కవిషా దిల్హారి (14), నీలాక్షిక సిల్వ (2), కౌశిని నూత్యంగన (11), శషిని గిమ్హాని (0), కావ్య (1) వికెట్లు తీయడంతో లంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. వైష్ణవి శర్మ, శ్రీచరణి చెరో రెండు, స్నేహ్ రాణా ఒక వికెట్ తీసింది.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక: 20 ఓవర్లలో 128/9 (హర్షిత 33, చామరి 31, వైష్ణవి 2/32, శ్రీచరణి 2/23).
ఇండియా: 11.5 ఓవర్లలో 129/3 (షెఫాలీ 69*, జెమీమా 26, మల్కి మదరా 1/22).
