- ప్రతిపక్షనేత హోదా ఆయనకు అనవసరం
- తోలు తీస్తా అంటే ఖాళీగా కూర్చుంటామా?
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తల్లాడ/సత్తుపల్లి , వెలుగు: ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్ రెండేండ్లలో ఒక్కరోజైనా శాసనసభలో ప్రజల పక్షాన మాట్లాడారా? అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమండిపడ్డారు. అసెంబ్లీకి రావడానికే భయపడే కేసీఆర్కు అపోజిషన్ లీడర్ హోదా అనవసరమన్నారు. మంగళవారం తల్లాడ మండలం పాత పినపాకలో మూడు సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. ‘పదిమందిని చూడగానే తోలు తీస్తా అంటూ మాట్లాడతావా? నీలాగా దిగజారి మాట్లాడే వ్యక్తిత్వం కాంగ్రెస్ నాయకులకు లేదు. నువ్వు తోలు తీస్తే ఇక్కడ ఎవరూ ఖాళీగా కూర్చోలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానిస్థితిలో లేదు’అని కౌంటర్ ఇచ్చారు. అపోజిషన్ లీడర్‌గా ఉన్న తాను ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వెళ్లకుండా లేనని, ప్రతిరోజు ప్రజల సమస్యలపై గళం వినిపించానని గుర్తు చేశారు. రాష్ట్రంలో 22 వేల కోట్ల వ్యయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తోందని, ఇది ఓర్వలేక బీఆర్ఎస్ విమర్శలకు దిగుతోందన్నారు.
తెలంగాణ రైజింగ్ పేర భారీ పెట్టుబడులు వస్తున్నాయని, దీంతో తమ ఉనికి కనిపించకుండాపోతుందన్న భయంతో రెండేండ్ల తర్వాత బయటకొచ్చి విషం కక్కి.. తిరిగి ఫామ్ హౌస్ లో పడుకోవడానికి వెళ్లారని ఫైర్ అయ్యారు. అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో 85 శాతం స్థానాలు సాధించడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో మహిళలకు వడ్డీ లేని రుణాలివ్వలేదని, తమ ప్రభుత్వం మొదటి దశలోనే 26 వేల కోట్ల వడ్డీ లేని రుణాలిచ్చిందన్నారు.
సింగరేణి లోకల్ కాదు గ్లోబల్ గా ఎదగాలి...
136 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణి లోకల్ గా కాదు గ్లోబల్ గా ఎదగాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన సత్తుపల్లిలో సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం బొగ్గు ఉత్పత్తికి పరిమితం అయితే సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందని, అందుకే రేర్ ఎర్త్ మినరల్స్, క్రిటికల్ మినరల్స్ కు సంబంధించిన బ్లాకుల వేలంలో పాల్గొనాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తోందన్నారు.
మొన్నటి వరకు ప్రభుత్వ రంగ సంస్థలే బొగ్గు తవ్వకాలు చేసేవని, కానీ ప్రస్తుతం కేంద్రం బొగ్గు గనులను వేలం వేస్తోందని, ఇందులో ప్రపంచంలోని ప్రైవేటు సంస్థలు కూడా పాల్గొంటున్నాయన్నారు. విదేశాల నుంచి కూడా బొగ్గు దిగుమతి చేసుకోవడంవల్ల పోటీ విపరీతంగా ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి పోటీకి నిలబడి నాణ్యతతో కూడిన బొగ్గును వెలికి తీసి సరఫరా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
85వేల మంది ఉద్యోగులున్న సింగరేణి భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా అధ్యయనం చేస్తూ పోటీలో నిలబడేందుకు అనేక ప్రణాళికలు రచిస్తుందన్నారు. విద్యుత్తు ఉత్పత్తి కే పరిమితం కాకుండా గ్రీన్ ఎనర్జీ లో భాగంగా సోలార్, హైడల్, బ్యాటరీ, పంపుడు స్టోరేజ్, హైడ్రోజన్ వంటి విభాగాల్లో విద్యుత్ ఉత్పత్తికి ప్లాన్ చేస్తున్నామన్నారు. బొగ్గు బావులతోనే సంతృప్తి చెందకుండా లిథియం, గ్రాఫైట్, కాపర్ లాంటి మైన్స్వేలంలో పాల్గొని ఆ బ్లాకులను సాధించాలని భావిస్తున్నట్టు తెలిపారు.
విదేశాల్లో కూడా మైనింగ్ అవకాశాలపై నిపుణుల సలహాలు స్వీకరించామని తెలిపారు. కర్ణాటకలో గోల్డ్, కాపర్ గనులను దక్కించుకుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని బొగ్గు బ్లాకులు దక్కించుకోవడంతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొని టెండర్లు దక్కించుకుంటామని అన్నారు. 1500 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి కోసం రాజస్థాన్ ప్రభుత్వంతో సింగరేణి జాయింట్ వెంచర్ లో పాల్గొంటుందని వివరించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, విద్యుత్ శాఖ చీఫ్ ఇంజినీర్ ఇనుగుర్తి శ్రీనివాసచారి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ నాగేశ్వరరావు ఉన్నారు.
సింగరేణి జీవీఆర్ఓపెన్ మైన్ ను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి
సత్తుపల్లిలోని జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ మైన్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులతో కలిసి పరిశీలించారు. మొదట వ్యూ పాయింట్ నుంచి మైన్ పరిశీలించిన డిప్యూటీ సీఎం ఆ తర్వాత మైన్ లోపలికి వెళ్లారు. ఓపెన్ మైన్ ను ఎలా ప్రారంభిస్తారు, ఎన్ని పొరలు ఉన్నాయి, మైన్ లో బొగ్గు ఎలా తీస్తారు, ఏ రకమైన బొగ్గు ప్రస్తుతం ఇక్కడ లభిస్తుంది, తీసిన బొగ్గును ఎలా బయటికి పంపిస్తారు, 24 గంటల పాటు మైన్ పనిచేస్తున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు సంబంధించి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మైన్ లో ఉత్పత్తి అవుతున్న బొగ్గుకు మార్కెట్లో ఏ ధర పలుకుతుందని ఆరా తీశారు.
