న్యూఢిల్లీ, వెలుగు: సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (ఏఎస్ జీఐ) గా సీనియర్ అడ్వొకేట్, తెలుగుదేశం పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ను కేంద్రం నియమించింది. ఆయనతో పాటు మరో ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్లు దవీందర్ పాల్ సింగ్, అనిల్ కౌశిక్‌కూ ఏఎస్ జీఐలుగా అవకాశం కల్పించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ (సిబ్బంది, శిక్షణ) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కేబినెట్ అపాయింట్ మెంట్ కమిటీ ఈ నియామకాలకు ఆమోదం తెలిపిందని అండర్ సెక్రటరీ కుందన్ నాథ్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏఎస్ జీఐగా నియమితులైన ఆ ముగ్గురూ మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారని తెలిపారు.
