వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ స్కాండల్ కేసుకు సంబంధించి అమెరికా న్యాయశాఖ తాజాగా 30వేల పత్రాలను రిలీజ్ చేసింది. 1993 నుంచి 1996 మధ్య ట్రంప్.. ఎప్‌స్టీన్ సొంత విమానంలో 8 సార్లు ప్రయాణించినట్లు ఫ్లైట్ లాగ్స్ ద్వారా బహిర్గతమైంది. గతంలో బయటికొచ్చిన జర్నీల కంటే ఇవి ఎక్కువని.. దర్యాప్తు సంస్థల ఈమెయిల్స్ ద్వారా తెలుస్తున్నది.
ఈ జర్నీల్లో ట్రంప్‌తో పాటు ఆయన మాజీ భార్య మార్లా మాపిల్స్, పిల్లలు టిఫనీ, ఎరిక్ కూడా ఉన్నారు. 4 సార్లు చేసిన ప్రయాణాల్లో ఎప్‌స్టీన్ సన్నిహితురాలు గిస్లేన్ మ్యాక్స్‌వెల్ కూడా ఉంది. కాగా, జెఫ్రీ ఎప్‌స్టీన్ అనే ఇన్వెస్టర్.. బాలికలపై లైంగిక దాడులు, హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. 2019లో జైలులో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, బిల్ గేట్స్ వంటి ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఈ కేసు చర్చనీయాంశమవుతున్నది.
1993లో ఎప్‌స్టీన్, ట్రంప్ జర్నీ
1990 టైమ్‌లో జరిగిన ఫ్లైట్ జర్నీలో ఎప్‌స్టీన్ ప్రైవేట్ జెట్‌లో కేవలం జెఫ్రీ ఎప్‌స్టీన్, డొనాల్డ్ ట్రంప్, 20 ఏండ్ల యువతి ఉన్నట్లు ఫ్లైట్ లాగ్స్ చెప్తున్నాయి. ఆ తర్వాత 1993లో ఎప్‌స్టీన్, ట్రంప్ ఇద్దరే ఆ విమానంలో ప్రయాణించినట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది.
నేతలను రక్షించే ఉద్దేశం లేదు: న్యాయ శాఖ
బాధితుల గోప్యతను కాపాడేందుకే కొన్ని ఫైల్స్‌ను తొలగించాం తప్ప రాజకీయ నేతలను రక్షించే ఉద్దేశం తమకు లేదని అమెరికా న్యాయశాఖ వివరణ ఇచ్చింది. 2020 ఎన్నికలకు ముందే వీటిని ఎఫ్‌బీఐకి సమర్పించామని స్పష్టం చేసింది. డాక్యుమెంట్లలో ట్రంప్‌పై చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని తెలిపింది. అయినప్పటికీ చట్టం పట్ల గౌరవం, పారదర్శకత కోసమే వీటిని బహిర్గతం చేస్తున్నట్లు పేర్కొంది.
