- ఈ నెల చివరి నాటికి పూర్తి
- ఇప్పటికే 98 శాతం పేమెంట్ రైతుల ఖాతాల్లోకి
నల్గొండ, వెలుగు: వానాకాలం సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు వచ్చాయి. ఈ నెలాఖరు వరకు కేంద్రాలకు ధాన్యం రావడం ఆగిపోతుందని భావిస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కోసం 707 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా, 443 కేంద్రాలను ఇప్పటికే మూసేశారు. 264 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10,48, 200 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
1,21,502 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన ఈ ధాన్యం విలువ 1,672 కోట్లు కాగా ఇప్పటికే మంది1,05,562 రైతుల ఖాతాల్లో రూ. 1,607 కోట్లు జమ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 3,20,224 మెట్రిక్ టన్నుల ధాన్యం సన్నరకం కాగా 4,59,006 మెట్రిక్‌టన్నుల ధాన్యం దొడ్డు రకానికి చెందినది. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం వరిధాన్యం పండించిన రైతులకు క్వింటాలుకు రూ.500 రూపాయల బోనస్‌ను ప్రకటించింది. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన సన్నరకం వరిధాన్యానికి రూ.105.46 కోట్ల బోనస్‌ను చెల్లించాల్సి ఉండగా, ఇప్పటికే రూ. 56.49 కోట్లు రైతులకు అందించారు.
ఆలస్యమైనా జోరుగా కొనుగోళ్లు
నల్గొండ జిల్లాలో 6,30,921 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ టార్గెట్‌గా పెట్టుకున్నారు. జిల్లాలో 274 దొడ్డు ధాన్యం, 98 సన్నధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రపోజ్ చేయగా జిల్లాలో 328 కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు. ఇప్పటివరకు 4.76 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించారు. మొంథా తుఫాన్ ప్రభావంతో చాలా చోట్ల వడ్లు తడిసి తేమ శాతం రాకపోవడంతో రైతులు తేమ వచ్చే దాకా ఆర బెట్టి సెంటర్లకు తీసుకురావడంతో కొంత ఆలస్యంగా కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి.
వ్యవసాయశాఖ అంచనా వేసిన విధంగా దిగుబడి వచ్చినా ఆశించిన మేరకు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకపోవడానికి కారణం ఆలస్యంగా కొనుగోళ్లు ప్రారంభించడమేనని అంటున్నారు. సుమారు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రైవేట్‌వ్యాపారులకు అమ్ముకున్న కారణంగా కొనుగోలు కేంద్రాలకు మూడు లక్షల మెట్రిక్ టన్నులకు మించి ధాన్యం రాకపోవచ్చని భావిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా -నల్గొండ జిల్లాలో 4,76 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా వీటిలో దొడ్డు వడ్లు 3.61 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా 1.56 లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లను కొనుగోలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 358 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం 271 కేంద్రాలు క్లోజ్ అయ్యాయి 87 కేంద్రాలలో మాత్రమే కొనుగోలు జరుగుతుండగా ఈ నెల చివరి నాటికి అన్నీ కేంద్రాలను క్లోజ్ చేయనున్నారు.
రైతుల ఖాతాలో రూ.1,607 కోట్లు జమ
నల్గొండ, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికిగాను రూ. 1607 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. సూర్యాపేట జిల్లాలో 38,330 మంది రైతుల నుండి రూ.636 కోట్ల విలువైన వడ్లను కొనుగోలు చేయగా ఇప్పటి వరకు 29 వేల మంది రైతులకు రూ.537 కోట్లు జమ చేశారు. ఇంకా రూ.98 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 83,202 రైతులు నుండిరూ.1135 కోట్ల విలువైన వడ్లను కొనుగోలు చేయగా వీటిలో 76,562 మంది రైతులకు రూ. 1070 కోట్లు చెల్లింపు పూర్తి చేశారు.
సూర్యాపేట జిల్లాలో
సూర్యాపేట జిల్లాలో 4.82 లక్షల ఎకరాలలో వరి సాగు చేయగా వీటిలో 10.32లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేయగా 4.30లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేయాలని ఆఫీసర్లు టార్గెట్ గా పెట్టుకున్నారు. 2,36,289 మెట్రిక్ టన్నుల సన్న రకం1,94,591 మెట్రిక్ టన్నులు ధాన్యం మార్కెట్ వస్తుందని అంచనా వేశారు.
వీటి కోసం 349 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు 2,06,224 సన్నాలు, 98,006 మెట్రిక్ టన్నులు దొడ్డు ధాన్యం కొనుగోలు చేశారు. మొత్తం 349 కొనుగోలు కేంద్రాలకు గాను 172 కొనుగోలు కేంద్రాలు క్లోజ్ చేయగా 177 కేంద్రాలలో కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ సెంటర్లు సైతం ఈ నెల చివరి నాటికి కొనుగోళ్లు పూర్తి చేసి మూసివేయనున్నారు.
