జ్ఞానవాపి విచారణ 6 నెలల్లో పూర్తిచేయండి

జ్ఞానవాపి విచారణ 6 నెలల్లో పూర్తిచేయండి
  • ‘జ్ఞానవాపి’ విచారణ 6 నెలల్లో పూర్తిచేయండి
  • వారణాసి జిల్లా కోర్టుకు అలహాబాద్ హైకోర్టు ఆదేశం
  • ముస్లిం పక్షాలు దాఖలు చేసిన ఐదు పిటిషన్లు కొట్టివేత

ప్రయాగ్‌‌రాజ్: జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్‌‌ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వారణాసిలో జ్ఞానవాపి మసీదు ఉన్న చోట ఆలయాన్ని పునరుద్ధరించాలంటూ దాఖలైన 1991 నాటి పిటిషన్‌‌పై విచారణను కొనసాగించాలని ఆదేశాలిచ్చింది. ఈ పిటిషన్‌‌ను, మసీదు ప్రాంగణంలో సర్వేను వ్యతిరేకిస్తూ మసీదు నిర్వహణ కమిటీ, యూపీ సెంట్రల్ సున్నీ వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన ఐదు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. వివాదాస్పద స్థలం మత స్వరూపాన్ని (రిలీజియస్ క్యారెక్టర్) కోర్టు మాత్రమే నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. 

ఆలయ పునరుద్ధరణకు సంబంధించిన విచారణను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని వారణాసి కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ పిటిషన్‌‌ కొనసాగించదగినదేనని, 1991 నాటి రిలీజియస్ వర్షిప్ (స్పెషల్ ప్రొవిజన్స్) చట్టం ప్రకారం నిషేధించాల్సిన పనిలేదని చెప్పింది. ‘‘రిలీజియస్ క్యారెక్టర్.. అనే పదాన్ని ఈ చట్టం నిర్వచించలేదు. ప్రత్యర్థి పక్షాలు కోర్టులో సమర్పించే సాక్ష్యం ద్వారా మాత్రమే రిలీజియస్ క్యారెక్టర్‌‌‌‌ను నిర్ణయించగలం. జ్ఞానవాపి మసీదుకు హిందూ రిలీజియస్ క్యారెక్టర్.. లేదా ముస్లిం రిలీజియస్ క్యారెక్టర్.. రెండింట్లో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది’’ అని జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ కామెంట్​ చేశారు.