మరో వివాదంలో ఆదిపురుష్.. సెన్సార్ బోర్డుకు హైకోర్టు నోటీసులు

మరో వివాదంలో ఆదిపురుష్.. సెన్సార్ బోర్డుకు హైకోర్టు నోటీసులు

ప్రభాస్ ఆదిపురుష్ సినిమా మరో వివాదంలో ఇరుక్కుంది. ఆదిపురుష్ మూవీకి వ్యతిరేకంగా దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సెన్సార్ బోర్డ్‌కు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ నోటీసులు జారీ చేసింది. పిటిషన్ పై స్పందించాల్సిందిగా కోరింది.

 

సెన్సార్‌ బోర్డ్‌ నుంచి సర్టిఫికెట్‌ పొందకుండానే ఆదిపురుష్ చిత్ర నిర్మాతలు ఆదిపురుష్‌ సినిమా టీజర్‌ను విడుదల చేశారని  కుల్దీప్ తివారీ పిటిషన్‌ దాఖలు చేశారు. టీజర్ లో సీత పాత్రలో కృతి సనన్ వేసుకున్న కాస్ట్యూమ్స్‌పై పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు. రాముడు , సీత దేవతలపై ప్రజలకు విశ్వాసం ఉందని.. అయితే టీజర్ లో ప్రజల విశ్వాసానికి వ్యతిరేకంగా చూపించారని పేర్కొన్నారు. దీంతో పాటు రావణుడి సన్నివేశంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సినిమాలో దేవుడి పాత్రలో నటిస్తున్న నటులు ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్, దేవదత్ నాగే, సన్నీ సింగ్‌లను కూడా ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌లో నిర్మాతలు, దర్శకులు ఓం రౌత్‌లు కూడా ప్రతివాదులుగా ఉన్నారు. దీంతో ఈ పిటిషన్‌ను స్వీకరించిన అలహాబాద్ హై కోర్ట్‌..సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది.  తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది.


బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న మూవీ ఆదిపురుష్‌. ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా  ఎన్నో అంచనాలున్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌, భారీ క్యాస్టింగ్‌తో నిర్మిస్తున్న  ఈ చిత్రం టీజర్ విడుదలైనప్పటి నుంచి వివాదంలో చిక్కుకుంది.  టీజర్‌లో హిందువుల మనోభావాలు దెబ్బతిసేలా సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. మరికొందరైతే  టీజర్‌ బాలేదని.. యానిమేషన్‌ మూవీలా ఉందంటూ విమర్శించారు.