
ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఐదు నగరాల్లో లాక్ డౌన్ విధించింది అలహాబాద్ హైకోర్టు. కోర్టు ఆదేశాలతో యోగి సర్కార్.. లక్నో, ప్రయాగ్‌రాజ్, వారణాసి, కాన్పూర్, గోరఖ్‌పూర్ లో ఇవాళ(సోమవారం) రాత్రి నుండి ఏప్రిల్ 26 వరకు పూర్తిగా లాక్ డౌన్ కొనసాగనున్నట్లు తెలిపింది. కేవలం నిత్యావసర, అత్యవసర సేవలకు సంబంధించిన షాపులు, మందుల షాపులు మాత్రమే తెరచి ఉండనున్నాయి. మతపరమైన కార్యక్రమాలన్నీంటినీ రద్దు చేసింది. షాపింగ్ కాంప్లెక్సులు, మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు కూడా మూతపడనున్నట్లు ప్రకటించింది. వివాహాలు, ఇతర సామాజిక కార్యకలాపాలపై నిషేధం విధించింది. రోడ్డు ప్రక్కన కూరగాయలు, పళ్లు, బ్రెడ్, పాలు అమ్మకం దార్లు ఈ లాక్‌డౌన్ సమయంలో ఉదయం 11 గంటల వరకు మాత్రమే అమ్ముకునేందుకు అనుమతినిచ్చింది. ఈ ఐదు నగరాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూత పడనున్నాయి. నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ ఐదు నగరాల్లో ఈ నెల 26 వరకు ప్రభుత్వ , ప్రైవేటు కార్యాలయాలన్నీ మూత పడనున్నాయి. ఆర్థిక సంస్థలు, వైద్య లేదా ఆరోగ్య సేవలను అందించే వ్యాపారాలు, మున్సిపల్ సంబంధించిన కార్యాకలాపాలు, ప్రజా రవాణా మినహాయింపునిచ్చింది యూపీ ప్రభుత్వం.