వైద్యం పేరుతో బతకని బిడ్డలకు రూ.53 లక్షల బిల్లు

వైద్యం పేరుతో బతకని బిడ్డలకు రూ.53 లక్షల బిల్లు
  • బతకని బిడ్డలకు రూ.53 లక్షల బిల్లు
  • సుమారు రూ.60 లక్షలు  కట్టించుకున్నరు   
  • రెయిన్​బో హాస్పిటల్​ పై   కవల పిల్లల తల్లిదండ్రుల ఆరోపణ

ఖైరతాబాద్, వెలుగు:  నెలలు నిండకముందే పుట్టిన కవలలకు ట్రీట్​మెంట్ ​ఇస్తామని చేర్చుకొని సుమారు రూ.60 లక్షల బిల్లు కట్టించుకుని బిడ్డలను మాత్రం బతికించలేకపోయారని పేరెంట్స్​ కన్నీరుమున్నీరయ్యారు. బాధితుల కథనం ప్రకారం.. ఏపీకి చెందిన నారపురెడ్డి సువర్ణ, రఘునాథ్ రెడ్డిలకు  ఏప్రిల్ 24 న ఓ ప్రైవేట్​ హాస్పిటల్​లో కవలలు పుట్టారు. నాలుగు నెలల ముందే తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని రెయిన్​బో హాస్పిటల్​లో చేర్పించారు.  37 రోజుల తర్వాత పాప చనిపోయింది.  ట్రీట్​మెంట్​తీసుకుంటున్న బాబు బుధవారం మరణించాడు. ఇప్పటికే రూ.20 లక్షలు చెల్లించామని, మరో రూ.33 లక్షల 16 వేల బిల్లు వేసి  కట్టించుకున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందారు. రెయిన్ బో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే బిడ్డల్ని కోల్పోయామని తండ్రి ఆరోపించారు. 

ఆరోపణలు అవాస్తవం

పేరెంట్స్​ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని రెయిన్ బో దవాఖానా మేనేజ్​మెంట్​ ఒక ప్రకటనలో పేర్కొంది. పిల్లలు నాలుగు నెలల ముందే తక్కువ బరువుతో పుట్టారని,  ఇలాంటి సందర్భాల్లో 50 శాతం మాత్రమే బతికే ఛాన్స్​ ఉంటుందని చెప్పామన్నారు. అయినా ట్రీట్​మెంట్​కు ముందుకు వచ్చారన్నారు.  తాము రూ.60 లక్షలు వసూలు చేయలేదని, రూ.6 లక్షల29వేలు మాత్రమే చెల్లించారన్నారు.