
- ఆడిటింగ్ కొనసాగుతుండగా ఆలస్యంగా వెలుగులోకి..
- కొద్దిరోజులుగా అదృశ్యమైన బిల్ కలెక్టర్
- అధికారులు, అధికార పార్టీ నేతలపైనా అనుమానాలు
- గోల్‌మాల్‌పై వివరణ కోరగా స్పందించని కమిషనర్
ఘట్ కేసర్, వెలుగు: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీలో రూ. 2 కోట్ల నిధుల గోల్ మాల్ జరిగినట్లు వస్తున్న ఆరోపణలు హాట్ టాపిక్‌గా మారాయి. మూడ్రోజులుగా మున్సిపాలిటీలో ఆడిటింగ్ కొనసాగుతుండగా, ఓ బిల్ కలెక్టర్ విధులకు దూరంగా ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది. మున్సిపాలిటీ బిల్లుల సొమ్మును ట్రెజరీలో జమ చేయకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధి సహకారంతో పక్కదారి పట్టించినట్లు సమాచారం. ఇలా చాలా రోజులుగా జరుగుతున్నప్పటికీ, తాజాగాజరుగుతున్న ఆడిటింగ్‌తో వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. దీన్ని కప్పిపుచ్చేందుకు ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మున్సిపాలిటీలో 18 వార్డులు ఉండగా, ఏడుగురు బిల్ కలెక్టర్లు బిల్లుల వసూలు విధులు నిర్వహిస్తుంటారు. వీరిలో ఒకరు ఆఫీసులోనే ఉంటూ వసూలైన బిల్లుల సొమ్మును ట్రెజరీలో జమ చేయాల్సి ఉంటుంది. మున్సిపాలిటీకి గతేడాది దాదాపు రూ.2 కోట్లు బకాయిలు ఉన్నాయి. ప్రస్తుత ఏడాది వివిధ పన్నుల రూపేణా రూ.3 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ప్రస్తుతం రూ.2 కోట్ల వరకు గోల్మాల్ జరిగినట్లు, బిల్ కలెక్టర్ కనిపించకపోవడం ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తుంది. కాగా, అదృశ్యమైన బిల్ కలెక్టర్ కుటుంబ కలహాలతో కొద్దిరోజులుగా డ్యూటీకి రావడం లేదని, ఆదివారం అతడు పుణేలో ఉన్నట్లు సమాచారం. అయితే, అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒత్తిడితో సొమ్మును ట్రెజరీలో జమ చేయలేదని, ప్రస్తుతం ఆడిటింగ్ చేస్తుండగా అవకతవకలన్నీ తనపైనే పడతాయని ఆందోళన చెంది విధులకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అతనిపై ఘట్కేసర్ పోలీసుస్టేషన్లో కుటుంబసభ్యులు మిస్సింగ్ కేసు పెట్టినట్లు సమాచారం. ఏదేమైనా మున్సిపాలిటీలో ఆడిటింగ్ పూర్తయిన తర్వాతే భారీ అవినీతి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిధుల గోల్‌మాల్‌పై కమిషనర్ స్పందించకపోవడం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. మూడు రోజులుగా స్పెషల్ ఆడిటింగ్ జరుగుతుందని కిందిస్థాయి ఉద్యోగులు చెబుతున్నారు. దీనిపై కమిషనర్‌ను వివరణ అడిగితే తర్వాత చెబుతానని సమాధానం దాటవేశారు. ఈ అవినీతిపై అధికారం పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారుల పాత్రపై అనుమానాలున్నాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మేడ్చల్ కలెక్టర్ స్పందించి విచారణ జరిపించాలని వారు కోరుతున్నారు.