కరీంనగర్ జిల్లాలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల విషయంలో మరీ ఇలా చేస్తున్నారేంటి..?

కరీంనగర్ జిల్లాలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల విషయంలో మరీ ఇలా చేస్తున్నారేంటి..?
  • కొందరికి గంటల్లో.. మరికొందరికి నెలల్లో.. 
  • బర్త్, డెత్ సర్టిఫికెట్ల అప్రూవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెవెన్యూ ఆఫీసర్ల పక్షపాత ధోరణి
  •  కరీంనగర్ ఆర్డీవో పరిధిలో పాటించని సిటిజన్ చార్టర్ 
  •  60 రోజుల్లోపు సర్టిఫికెట్లు జారీ చేయడంలో నిర్లక్ష్యం 

కరీంనగర్, వెలుగు: లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రిజిష్టర్ అయ్యే బర్త్, డెత్ రికార్డుల విషయంలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెవెన్యూ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరి దరఖాస్తులకు గంటల్లో, లేదంటే ఒకటి, రెండు రోజుల్లోనే అప్రూవల్ ఇస్తే.. చాలామంది అప్లికేషన్లను నెలల తరబడి పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిచయాలు ఉండి పైరవీలు చేసుకుంటే, లేదా ఏమైనా ముట్టజెప్పితే రెండు, మూడు రోజులు లేదా వారం రోజుల్లోనే రెవెన్యూ సిబ్బంది రిపోర్టులు ఇవ్వడం, ఎలాంటి ప్రయత్నం చేయకపోతే నెలల తరబడి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సర్టిఫికెట్ల జారీలో జాప్యానికి కారణమైన రెవెన్యూ సిబ్బందిపై జరినామాలు విధించడంతోపాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటేనే బాధ్యతాయుతంగా పనిచేస్తారనే డిమాండ్ వినిపిస్తోంది.  

సగం అప్లికేషన్లు 60 రోజుల తర్వాతే.. 

కుటుంబంలో జననం, మరణంగానీ సంభంవించిన ఏడాదిలోపు మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో అప్లై చేసుకుని సర్టిఫికెట్లు పొందవచ్చు. కానీ ఏడాదికి ఒక్కరోజు దాటినా ఆర్డీవోనే సర్టిఫికెట్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఏడాది దాటిన వాళ్లు మొదలు 50, 60 ఏళ్ల క్రితం నాటి బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం కూడా మీ సేవా ద్వారా అప్లై చేసుకుంటారు. మీ సేవ దరఖాస్తుపై సంబంధిత ఆర్ఐ ఎంక్వైరీ చేసి తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిపోర్టు సమర్పిస్తారు. తహసీల్దార్ ఆ రిపోర్టును వెరిఫై చేసి ఆర్డీవోకు పంపిస్తారు. 

ఆ రిపోర్టులోనే సర్టిఫికెట్లు, ఇతర ఆధారాలు పరిశీలించి రికమండెడా.. నాట్ రికమండెడా అనే విషయంలో తహసీల్దారే సిఫార్సు చేస్తారు. అది పరిశీలించాక ఆర్డీవో ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సిటిజన్ చార్టర్ ప్రకారం ఇలాంటి లేట్ బర్త్, డెత్ సర్టిఫికెట్లను 60 రోజుల్లోపు జారీ చేయాల్సి ఉంటుంది. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సామాజిక కార్యకర్త మహ్మద్ షాబుద్దీన్ ఆర్టీఐ కింద సేకరించిన సమాచారం ప్రకారం కరీంనగర్ ఆర్డీవో పరిధిలో 1 జనవరి 2023 నుంచి 30 జూన్ 2025 వరకు బర్త్, డెత్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి 8,001 అప్లికేషన్లు వస్తే వీటిలో 6,444 అప్లికేషన్లను అప్రూవ్ చేశారు. 775 అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి. మరో 782 అప్లికేషన్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఉన్నాయి. అప్రూవల్ అయిన అప్లికేషన్లలో 3,686 అప్లికేషన్లు 60 రోజుల్లోపు అప్రూవ్ కాగా, 2,758 సర్టిఫికెట్ల జారీకి మూడు నెలలు, నాలుగు నెలలు, కొందరికైతే 10 నెలలు, సంవత్సరం కూడా పట్టింది.

రెండున్నర గంటల్లో రిపోర్ట్, అప్రూవల్.. 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓ వ్యక్తి 2011 సెప్టెంబర్ 29న పుట్టిన తన కూతురి బర్త్ సర్టిఫికెట్ కోసం మీ సేవలో జనవరి 31న మధ్యాహ్నం 2.35 గంటలకు అప్లై చేశాడు. అప్లై చేసిన రోజే సాయంత్రం 5.03 గంటలకు అప్రూవ్ అయింది. అంటే 2.28 గంటల్లో ఆర్ఐ రిపోర్ట్ ఇవ్వడం, తహసీల్దార్ చదవడం, ఆర్డీవో అప్రూవ్ చేయడం చకచకా జరిపోయాయి. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓ వృద్ధుడు తన బర్త్ సర్టిఫికెట్ కోసం నిరుడు జనవరి 12న దరఖాస్తు చేసుకున్నారు. 1951లో పుట్టిన ఆయన బర్త్ సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకుంటే కేవలం ఒక్క రోజులోనే సర్టిఫికెట్
 మంజూరైంది. 

వీళ్లకు ఏడాది దాటాకే..

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఎల్. సంతోష్ 2020లో పుట్టిన తన కూతురి బర్త్ సర్టిఫికెట్ కోసం 2023 జులైలో మీ సేవలో దరఖాస్తు చేస్తే ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అవ్రూవల్ అయింది. అంటే బర్త్ సర్టిఫికెట్ మంజూరుకు ఏడాది 10 నెలలు పట్టింది. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన శ్రీలత అనే మహిళ 2007లో పుట్టిన తన కుమారుడి బర్త్ సర్టిఫికెట్ కోసం 2023 ఫిబ్రవరి నెలలో మీ సేవలో అప్లై చేస్తే 2024 జూలైలో అప్రూవల్ అయింది. అంటే సంవత్సరం మీద 5 నెలల సమయం పట్టింది.  కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన అఫ్జల్ తన కూతురి బర్త్ సర్టిఫికెట్ కోసం నిరుడు జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్లై చేసుకుంటే.. సరిగ్గా ఏడాదికి జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్రూవ్ చేశారు. ఇలా ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అప్లికేషన్లను 100 రోజులు దాటాకే అప్రూవ్ చేసినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి.