- పత్తి పర్చేజింగ్ ఆఫీసర్,
- మిల్లు యజమానుల కుమ్మక్కు
- క్వింటాల్ కు రూ.700 నుంచి రూ.800 వసూళ్లు
- పెద్ద మొత్తంలో వసూళ్ల పర్వం కొనసాగినట్లు విమర్శలు
గద్వాల, వెలుగు : సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి కొనుగోలు కేంద్రంలో వసూళ్ల దందా కొనసాగుతున్నది. క్వింటాల్ పత్తికి రూ.700 నుంచి రూ.800 వరకు, ఓటీపీ చెప్పడానికి రూ.4 వేల వసూళ్లు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. సీపీఐ పత్తి పర్చేజింగ్ ఆఫీసర్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయ్, మిల్లు యజమానులు కుమ్మక్కై వసూళ్ల పర్వానికి తెర లేపారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.
జోగులాంబ గద్వాల జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గద్వాలలో బాలాజీ కాటన్ జిన్నింగ్ మిల్లు, హరిత కాటన్ మిల్లు, ఆలంపూర్ లో వరసిద్ధి వినాయక కాటన్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మిల్లుల్లో రైతుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సగం పత్తి దింపాక బేరాలు..
సీసీఐ కొనుగోలు కేంద్రానికి రైతు పత్తి తీసుకొచ్చాక తేమ శాతాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత కచర, గొగ్గి పత్తి ఉంటే వాటిని పర్చేజింగ్ ఆఫీసర్ రిజెక్ట్ చేయాలి. కానీ అలా చేయకుండా రైతు తీసుకొచ్చిన పత్తిని సగం దింపిన తర్వాత మాయిశ్చర్ లేదని, గొగ్గి, కచర పత్తి ఉందని వాపస్ తీసుకుపోవాలంటూ రైతులను బెదిరిస్తారు.
దీంతో రైతులు చేసేదేమీలేక ఎలాగో ఒకలాగా కొనండి సార్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో క్వింటాల్ కు రూ.700 నుంచి రూ.800 డిమాండ్ చేసి డబ్బు తీసుకున్న తర్వాత పత్తిని కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
వెలుగులోకి తెచ్చిన ధర్మవరం రైతులు..
సీసీఐ కొనుగోలు కేంద్రంలో రెండు నెలల నుంచి వసూళ్ల పర్వం కొనసాగుతూనే ఉన్నది. సోమవారం గద్వాలలోని శ్రీ బాలాజీ కాటన్ జిన్ని మిల్లుకు ఎర్రవల్లి మండలం ధర్మవరం గ్రామానికి చెందిన రైతులు పత్తి అమ్మేందుకు వెళ్లారు. పత్తి కొనుగోలు చేయాలంటే డబ్బులు ఇవ్వాలని సీసీఐలో పనిచేస్తున్న ఎంప్లాయిస్ తోపాటు మిల్లు సూపర్వైజర్లు డిమాండ్ చేశారు.
దీంతో 111 క్వింటాళ్ల పత్తి తీసుకొచ్చిన గోపాల్ రెడ్డి రూ.28 వేలు, ఖాజామియా రూ.6 వేలు, ప్రభాకర్ రెడ్డి రూ.25 వేలు ఇచ్చారు. డబ్బులు ఇచ్చాకే తమ పత్తిని కొనుగోలు చేశారని రైతులు నాగభూషణంరెడ్డి, సత్యారెడ్డి చెప్పారు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఖాజామియా అనే రైతుకు సంబంధించి రూ.6 వేలు మిల్లు ఎంప్లాయి వెనక్కి ఇచ్చారని తెలుస్తోంది.
జిల్లాలో లక్షా71 వేల క్వింటాళ్ల పత్తి కొనుగోలు..
జిల్లాలో మూడు కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 1,71,538.35 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కన పెద్ద మొత్తంలో వసూళ్ల పర్వం కొనసాగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఔట్సోర్సింగ్ ఎంప్లాయిగా ఉన్న వ్యక్తిని ముందు పెట్టి సీసీఐ ఆఫీసర్లు, మిల్లు యజమానులు ప్రతిరోజు లక్షల్లో రైతుల నుంచి డబ్బులు వసూళ్లు చేశారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
ఎంక్వయిరీ చేస్తాం..
పత్తి మిల్లుల్లో డబ్బు వసూళ్ల వ్యవహారం మా దృష్టికి రాలేదు. ఈ విషయంపై ఎంక్వయిరీ చేస్తాం. డబ్బు వసూళ్లు చేసినట్టు తేలితే మిల్లు యజమానులతోపాటు ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటాం.-పుష్పమ్మ, మార్కెటింగ్ ఆఫీసర్, గద్వాల
