‘డబుల్’ లబ్ధిదారులంతా అర్హులేనా ?..మంచిర్యాలలో డబుల్ బెడ్ రూం ఇండ్ల డ్రా పై ఆరోపణలు

‘డబుల్’ లబ్ధిదారులంతా అర్హులేనా ?..మంచిర్యాలలో డబుల్ బెడ్ రూం ఇండ్ల డ్రా పై ఆరోపణలు
  • ఒక్కో డివిజన్ నుంచి 12 మందిని సెలెక్ట్ చేసిన కార్పొరేటర్లు
  • బీజేపీ, బీఆర్ఎస్ సహా పలువురు కాంగ్రెస్ కార్పొరేటర్లకు నో ఇన్ఫర్మేషన్
  • పక్క డివిజన్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ లీడర్లకు పెత్తనం
  • 344 డబుల్ బెడ్ రూం ఇండ్లకు 807 మందితో డ్రా

మంచిర్యాల, వెలుగు :  మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక తీరుపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక రాజీవ్ నగర్ లో నిర్మించిన, ఇంకా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లకు గత నెల 28న రెవెన్యూ, మున్సిపల్ ఆఫీసర్లు డ్రా తీశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కార్పొరేటర్లు ఒక్కో డివిజన్ నుంచి 12 మందిని సెలెక్ట్ చేశారు.

అయితే బీజేపీ, బీఆర్ఎస్ తో పాటు ఎనిమిది మంది కాంగ్రెస్ కార్పొరేటర్లకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని, పక్క డివిజన్ కార్పొరేటర్లకు, లోకల్ లీడర్లకు పెత్తనం కట్టబెట్టి, వాళ్లు అందించిన లిస్ట్ ప్రకారమే డ్రా నిర్వహించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్పొరేటర్లు తమకు నచ్చిన వారిని అర్హుల లిస్టులో చేర్చారని, ఇందుకోసం లక్షల రూపాయలు చేతులు మారాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి అర్హులు ఎవరో, అనర్హులు ఎవరో తేల్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పూర్తిగా ఇండ్లు లేని నిరుపేదలకే డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలని కోరుతున్నారు. 

గతంలోనూ అదే తీరు

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజీవ్ నగర్ లో 650 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇందులో సగానికిపైగా పూర్తికాగా, కోర్టు కేసులు, ఇతర కారణాలతో మరికొన్ని అసంపూర్తిగా మిగిలిపోయాయి. డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణానికి స్థలం ఇచ్చిన 30 మందికి నేరుగా ఇండ్లు కేటాయించారు. అనంతరం 2023లో మొదటి దశలో మరో 330 డబుల్ బెడ్ రూం ఇండ్లకు డ్రా నిర్వహించారు. అప్పట్లోనే వేలాది అప్లికేషన్లు రాగా 1,700 మందిని షార్ట్ లిస్ట్ చేసి డ్రా తీశారు. కానీ అనర్హులకు ఇండ్లు దక్కాయని ఆరోపణలు రావడంతో మున్సిపల్ ఆఫీసర్లు పలుమార్లు ఎంక్వైరీ నిర్వహించి 68 మందిని అనర్హులుగా తేల్చారు. డ్రాలో ఎంపికైన వారికి ఇప్పటివరకూ ఇండ్లు కేటాయించలేదు. తాజాగా రెండో దశలో మిగతా 352 ఇండ్లకు డ్రా నిర్వహించారు. 

వారంతా అర్హులేనా ?

డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కార్పొరేటర్లు ఒక్కో డివిజన్ కు 12 మంది చొప్పున 720 మందిని ఎంపిక చేయగా.. అదనంగా మరికొంత మందిని కలిపి మొత్తం 807 మందిని సెలెక్ట్ చేశారు. ఈ లిస్ట్ ప్రకారమే డ్రా తీయడంపై  అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు మాత్రం గతంలో అర్హులుగా ఎంపిక చేసిన వారితో పాటు ప్రజా పాలనలో,  గ్రీవెన్స్ లో వచ్చిన 17 వేలకుపైగా దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించాకే డ్రా తీశామని చెబుతున్నారు. రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 6 శాతం, మైనారిటీలకు 12 శాతం, మిగతా 65 శాతం జనరల్ కేటాయించామని అంటున్నారు. అయితే ఇందులో అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు ? అన్నది తేలాల్సి ఉంది. డబుల్ బెడ్ రూంలను సొంత ఇండ్లు, నివాస స్థలాలు లేని వారికి మాత్రమే కేటాయించాలని పలువురు కోరుతున్నారు.

అప్పగించేది ఎప్పుడో ?

దాదాపు పదేండ్ల కిందట డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించగా అవి ఇప్పటికీ పూర్తి కాలేదు. మొదటి దశలో పూర్తయిన ఇండ్లను సైతం ఇప్పటివరకు లబ్దిదారులకు అప్పగించలేదు. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేసిన తర్వాత వచ్చే ఏడాది జులైలో అందరికీ ఒకేసారి అప్పగిస్తామని చెబుతున్నారు. కానీ.. ఇప్పటికే నిర్మాణాలు పూర్తైన ఇండ్లు నిర్వహణ లేక పగుళ్లు తేలుతున్నాయి. కొన్ని ఇండ్ల తలుపులు, కిటికీలు పగిలిపోగా, మరికొన్ని దొంగలపాలయ్యాయి. ఎలక్రికల్ వైర్లు, సానిటరీ పైప్ లైన్లు సైతం చెడిపోయాయి. వెంటనే వీటికి రిపేర్లు చేసి లబ్దిదారులకు అప్పగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.