డీఫాల్టర్ల చేతికి  వానాకాలం వడ్లు..బ్యాంకు గ్యారంటీ సరిపడా లేకున్నా కేటాయింపులు  

 డీఫాల్టర్ల చేతికి  వానాకాలం వడ్లు..బ్యాంకు గ్యారంటీ సరిపడా లేకున్నా కేటాయింపులు  
  • కరీంనగర్ జిల్లాలో డీఫాల్ట్ జాబితాలో 109 మిల్లులు 
  • యాసంగిలోనూ మరికొందరు డీఫాల్టర్లకు ఇచ్చేందుకు కొందరు ఆఫీసర్ల ప్లాన్‌‌‌‌? 

కరీంనగర్, వెలుగు:  కరీంనగర్ జిల్లాలో వానాకాలం వడ్లు డీఫాల్ట్ మిల్లులకు చేరాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే జిల్లావ్యాప్తంగా 108 మిల్లులను ఆఫీసర్లు డీఫాల్ట్‌‌‌‌గా గుర్తించారు. ఈ మిల్లులపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించొద్దని, రిజిస్ట్రేషన్ చేయొద్దని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న జిల్లా రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌కు లెటర్ రాసిన విషయం తెలిసిందే.

ఇంతవరకు బాగానే ఉన్నా ఈ జాబితాలోని కొన్ని డీఫాల్ట్ మిల్లులకు గత వానాకాలంలో ధాన్యం కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు త్వరలో యాసంగి వడ్లు కూడా డీఫాల్ట్ మిల్లులకు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

వడ్ల కేటాయింపుల్లో అధికార దుర్వినియోగం

కరీంనగర్ జిల్లా సివిల్ సప్లయీస్ ఆఫీసర్లు కొందరు రైస్ మిల్లుల యజమానులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 27 మార్గదర్శకాలకు విరుద్ధంగా మిల్లర్లకు ధాన్యం కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. నామమాత్రపు బ్యాంకు గ్యారంటీతో వడ్లు కేటాయించినట్లు తెలిసింది.

జిల్లాలోని ఓ బడా మిల్లర్‌‌‌‌‌‌‌‌కు చెందిన తిమ్మాపూర్ మండలం రేణికుంటలో 2 బాయిల్డ్ మిల్లులకు, మానకొండూరులో ఉన్న 2 బాయిల్డ్ మిల్లులకు అధికారులు మినహాయింపులు ఇచ్చి ధాన్యం కేటాయించినట్లు తెలిసింది. ఒక్కో మిల్లుకు రూ.10 లక్షల బ్యాంకు గ్యారంటీతో  నాలుగింటికి 400 పైగా ఏసీకేల వడ్లు కేటాయించడం ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధమనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

  అధికారులు గుర్తించిన డీఫాల్ట్ మిల్లుల జాబితాలో హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లికి చెందిన రవిచంద్ర ఇండస్ట్రీస్, రంగాపూర్ లోని ఎస్సార్ ట్రేడర్స్, శ్రీలక్ష్మి ఇండస్ట్రీస్ పీబీఆర్ఎం మిల్లులు ఉన్నాయి. రవిచంద్ర ఇండస్ట్రీస్ లో 2019–20 యాసంగి ధాన్యం, ఎస్సార్ ట్రేడర్స్, శ్రీలక్ష్మి ఇండస్ట్రీస్ లో 2021–22 వానాకాలం ధాన్యం దారిమళ్లింది.

జమ్మికుంట మండలంలోని శ్రీదేవి, సప్తగిరి మిల్లులు, తిమ్మాపూర్ మండలంలోని వెంకటేశ్వర మోడ్రన్ రైస్ మిల్ తోపాటు మరికొన్ని రైస్ మిల్లులు డీఫాల్ట్ జాబితాలో ఉన్నాయి. ఈ మిల్లులు డీఫాల్ట్ జాబితాలో ఉన్నప్పటికీ 2024-–25తోపాటు 2025–26 వానాకాలం సీజన్ లో సరిపడా బ్యాంకు గ్యారంటీ లేకున్నా వడ్లు కేటాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

వెరిఫై చేస్తాం.. డీఫాల్టర్లకు కేటాయించే అవకాశం లేదు

కొందరు మిల్లర్లు తమ పెండింగ్ బకాయిలు చెల్లించినా డీఫాల్ట్ రైస్ మిల్లర్ల జాబితా అప్ డేట్ కాకపోయి ఉండొచ్చు. లేదంటే సరిపడా బ్యాంకు గ్యారంటీ సమర్పించాకే ఆయా మిల్లులకు ధాన్యం కేటాయింపులు చేసి ఉంటాం. మళ్లీ ఒకసారి వెరిఫై చేస్తాం.- నర్సింగారావు, డీఎస్‌‌‌‌వో నర్సింగారావు 

యాసంగిలోనూ డీఫాల్టర్లకు..

రానున్న యాసంగి సీజన్ సీఎంఆర్ తోపాటు టెండర్ ధాన్యం పెండింగ్‌‌‌‌లో ఉన్న బడా రైస్ మిల్లర్లకు వడ్లు కేటాయించేందుకు కొందరు సివిల్ సప్లై ఆఫీసర్లు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు తెలిసింది. డీఫాల్టర్ల పేరిట ధాన్యం ఇవ్వడం నిరాకరిస్తే సరిపడా మిల్లులు దొరకవనే సాకుతో ఇలాంటివారికి మినహాయింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.