కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా కలియాచక్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రంగంలోకి దిగింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్‌ఐఏ బృందాలు ఇప్పటికే విచారణను ప్రారంభించాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 35 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధాన కుట్రదారుడిగా భావిస్తున్న న్యాయవాది మోఫక్కరుల్ ఇస్లాంను పశ్చిమ బెంగాల్ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సిలిగురి సమీపంలోని బాగ్‌డోగ్రా విమానాశ్రయం నుంచి దేశం విడిచి పరారయ్యేందుకు ప్రయత్నిస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం మోఫక్కరుల్ ఇస్లాం తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఓ వర్గానికి చెందిన ఓటర్ల పేర్ల తొలగింపుపై జరుగుతున్న నిరసనలో మాత్రమే పాల్గొన్నానని, తాను ఏ హింసకు నాయకత్వం వహించలేదని తెలిపారు. ‘‘నేను కోల్‌కతా నుంచి అలీపుర్‌దువార్ వెళ్తుండగా, నిరసన జరుగుతున్న చోట ప్రసంగించాను తప్ప, జడ్జిలను అడ్డుకోలేదు.
మొతాబరి వద్ద ఘటన జరిగినప్పుడు నేను హైవేపై ప్రయాణిస్తున్నాను’’అని ఆయన వివరణ ఇచ్చారు. కాగా, గత బుధవారం మాల్దా జిల్లా కలియాచక్ ప్రాంతంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ జరుగుతుండగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓటర్ల జాబితా నుంచి భారీగా పేర్లను తొలగించారనే ఆరోపణలతో కొంతమంది ఒక్కసారిగా వచ్చి, విధుల్లో ఉన్న ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను గంటల తరబడి నిర్బంధించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పరిస్థితి చేయిదాటిపోవడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది.
