- స్టేట్లో ఇప్పుడు ఎన్నికలొస్తే కాంగ్రెస్ ది మూడోస్థానమే: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని, ఇప్పుటికిప్పుడు ఎన్నికలొస్తే ఆ పార్టీ మూడో స్థానానికే పరిమితమవుతుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చేశారు. క్షేత్రస్థాయిలో యూత్, మహిళలు, రైతుల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, మైనార్టీలు ఓటేస్తేనే ఆ మాత్రం పరువు దక్కుతున్నదని పేర్కొన్నారు.
ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తోందని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నికలు పెడితే కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావని, అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికలను ఎదుర్కోవడానికి సీఎం భయపడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ కావాలనే జాప్యం చేస్తోందని ఏలేటి ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని, అందుకే గత ప్రభుత్వ అవినీతిపై ఎలాంటి విచారణలు ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనకు వస్తున్న స్పందనను చూసి తట్టుకోలేక, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. వీరిద్దరిని కలిపింది ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ అని, అందుకే కేసులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయన్నారు. బెంగాల్ తర్వాత బీజేపీ హైకమాండ్ తెలంగాణపైనే ప్రత్యేక ఫోకస్ పెట్టిందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని మహేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, ఈ ఆరు నెలల కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలపై మాట్లాడకుండా కేవలం రూ.200 కోట్ల స్కామ్ అంటూ సవాళ్లు విసురుకోవడం హాస్యాస్పదమన్నారు. నిజంగా చర్చ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చకు రావాలని ఏలేటి డిమాండ్ చేశారు.
