ఇన్వెస్టర్లను పరిచయం చేస్తామంటూ రూ.50 లక్షలు గుంజిన్రు..సినిమా నిర్మాతకు బురిడీ

ఇన్వెస్టర్లను పరిచయం చేస్తామంటూ రూ.50 లక్షలు గుంజిన్రు..సినిమా నిర్మాతకు బురిడీ

జూబ్లీహిల్స్, వెలుగు: సినిమా నిర్మాణానికి పెట్టుబడిదారులను పరిచయం చేస్తామని నమ్మించి రూ.50 లక్షలు తీసుకుని మోసం చేసిన ఇద్దరిపై జూబ్లీహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుప్పాలగూడ-మణికొండ ప్రాంతంలో నివసించే సినీ నిర్మాత వెంకట అనీశ్​రెడ్డి రెండేళ్లుగా ‘మహారాగ్ని’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

సినిమా నిర్మాణానికి పెట్టుబడిదారులను వెతుకుతున్న సమయంలో ప్రశాసన్ నగర్ లోని సన్‌‌లిట్ గ్రూప్ కార్యాలయంలో మోసిన్ ఖాన్, తబ్రేజ్ లతో పరిచయం ఏర్పడింది. ప్రముఖ ఇన్వెస్టర్లను పరిచయం చేస్తామని హామీ ఇవ్వడంతో, నిర్మాత 2025 ఆగస్టులో మోసిన్ ఖాన్‌‌కు రూ.25 లక్షలు, తబ్రేజ్‌‌కు మరో రూ.25 లక్షలు మూడు విడతల్లో చెల్లించాడు. 

అయినా ఒక్క పెట్టుబడిదారుని కూడా పరిచయం చేయలేదని, డబ్బు తిరిగి అడిగితే సాకులు చెబుతూ కాలయాపన చేశారని బాధితుడు ఆరోపించాడు. తర్వాత ఫోన్ కాల్స్‌‌కూ స్పందించకుండా తప్పించుకుంటున్నారని తెలిపాడు. జులై 1న సన్‌‌లిట్ గ్రూప్ ఆఫీసుకు వెళ్లిన అనీష్ రెడ్డి.. డబ్బులు లేదా పెట్టుబడిదారుల వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 

ఈ సందర్భంగా మోసిన్ ఖాన్ తనను గదిలోకి తీసుకెళ్లి బౌన్సర్లతో కలిసి దాడికి పాల్పడ్డాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.