హైదరాబాద్ సిటీ, వెలుగు: హుస్సేన్‌సాగర్ లో గణేష్ నిమజ్జన ఘాట్ వద్ద ఏటా ఎదురవుతున్న భద్రతా సవాళ్లకు హెచ్ఎండీఏ శాశ్వత పరిష్కారం కనుగొంది. ఎన్టీఆర్ గార్డెన్స్ ఎదురుగా ఉన్న ప్రధాన ఘాట్ వద్ద రూపురేఖలు మార్చేలా ప్రతిష్టాత్మకమైన ‘గేబియన్ వాల్’ నిర్మాణాన్ని చేపట్టింది. గణేశ్ఉత్సవాల ముగింపు సందర్భంగా ఖైరతాబాద్ గణేశుడితో పాటు వేలాది భారీ విగ్రహాలను ఇక్కడి నుంచే నిమజ్జనం చేస్తుంటారు. అయితే, భారీ బరువుండే విగ్రహాలు, వాటిని ఎత్తేందుకు ఉపయోగించే క్రేన్ల లోడ్ కారణంగా అక్కడ ఘాట్ కుంగిపోవడంతో పాటు నేల కోతకు గురవుతున్నది.
దీనికి చెక్ పెడుతూ ఒడ్డును పటిష్టం చేసేందుకు ఉక్కు తీగలతో అల్లిన బలమైన జాలీలలో పెద్ద రాళ్లను నింపి ఈ రిటైనింగ్ నిర్మాణాన్ని (గేబియన్ వాల్) నిర్మిస్తున్నారు. ఇది నీటి అలల ప్రభావం వల్ల ఒడ్డు దెబ్బతినకుండా రక్షణ కల్పిస్తుంది. ఫలితంగా భారీ క్రేన్లు సురక్షితంగా పనిచేయడానికి వీలవుతుంది. అలాగే, నిమజ్జనం వీక్షించే వేలాది మంది భక్తుల భద్రతకు ఢోకా ఉండదు. వాటర్‌ఫ్రంట్, రివర్‌బ్యాంక్ రక్షణ నిర్మాణాల్లో అనుభవం ఉన్న ముంబై నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక ఎర్త్‌మూవింగ్ మెషీన్లు, రాక్ ఫిల్లింగ్ పరికరాలతో పనులు జరుగుతున్నాయి. తుది దశకు చేరిన ఈ పనులు 15 రోజుల్లో పూర్తి కానున్నాయి.
