పార్టీ మారినోళ్ల ఇంటి ముందు ఏ డప్పు కొట్టాలి?: మహేశ్వర్ రెడ్డి

పార్టీ మారినోళ్ల ఇంటి ముందు ఏ డప్పు కొట్టాలి?:  మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: పార్టీ మారినోళ్ల ఇండ్ల ముందు ఏ డప్పు కొట్టాలని సీఎం రేవంత్  రెడ్డిని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌‌కు ఫిర్యాదు చేయడానికి ఎన్నిసార్లు వెళ్లినా ఆయన అందుబాటులో ఉండడం లేదని తెలిపారు. అపాయింట్​మెంట్  కోసం అడిగినా సమయం ఇవ్వడం లేదన్నారు.

 సోమవారం బీజేపీ స్టేట్​ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్​గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ మారితే వారి ఇండ్ల ముందు చావు డప్పు కొట్టమన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్  పార్టీ చేర్చుకుంటోంది. మరి ఆ ఎమ్మెల్యేల ఇంటి ముందు ఏ డప్పు కొట్టాలో చెప్పాలి” అని ఏలేటి డిమాండ్  చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్  వేస్తామని తెలిపారు.