ఖమ్మం జిల్లాలో ఒకవైపు నామినేషన్లు.. మరోవైపు పొత్తు చర్చలు..!

ఖమ్మం జిల్లాలో  ఒకవైపు నామినేషన్లు..  మరోవైపు పొత్తు చర్చలు..!
  • ఏదులాపురంలో 18 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ 
  • బీఆర్ఎస్, సీపీఎం పొత్తు, సీపీఐ కోసం ప్రయత్నాలు
  • తొలి రోజు మూడు మున్సిపాలిటీల్లో ఏడు నామినేషన్లు దాఖలు

ఖమ్మం, వెలుగు :  మున్సిపల్ ఎలక్షన్లకు ఒకవైపు నామినేషన్లు ప్రారంభమైనా, ఖమ్మం జిల్లాలో ఇంకా పార్టీల మధ్య పొత్తు చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ఎలక్షన్లలో బీఆర్ఎస్, సీపీఎం కలిసి వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించాయి. మరోవైపు సీపీఐ కూడా కలిసి వస్తుందన్న ఆశతో ఇంకా వెయిట్ చేస్తున్నాయి. ఏదులాపురంలో కాంగ్రెస్, సీపీఐ ఒంటరిగానే బరిలో నిలవాలని దాదాపు డిసైడయ్యాయి. 

ఈ మున్సిపాలిటీలో ఇప్పటికే 18 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్​రిలీజ్ చేసింది. సీపీఐతో పొత్తులు, అభ్యర్థుల ఎంపికలో ఆలస్యం కారణంగా మిగిలిన 14 వార్డులను పెండింగ్ పెట్టారు. సీపీఐ మొదట 12 వార్డులు డిమాండ్ చేయగా, చివరకు ఏడు వార్డులు తమకివ్వాలని కోరింది. కాంగ్రెస్​ఐదు వార్డులు కేటాయించేందుకు మాత్రమే అంగీకరించడంతో ఏకాభిప్రాయం రాలేదు.

 కాంగ్రెస్​తో సీపీఐ పొత్తు లేకపోవడంతో తమతో కలిసి రావాలంటూ బీఆర్ఎస్, సీపీఎం కలిసి సీపీఐతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇది కూడా ఇంకా ఫైనల్ కాలేదు. మరోవైపు సీపీఐ తాము సొంతంగా 15 వార్డుల్లో పోటీ చేస్తామని చెబుతున్నారు. మధిర మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఎం పొత్తు ఖరారైందని ప్రకటించారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పొత్తుతో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది.

 ఈ పార్టీల పొత్తు ఖరారు అయినప్పటికీ ఇంతవరకు బయటికి ప్రకటించలేదు. మధిరలో బీజేపీ, జనసేన ఒంటరిగా పోటీ చేసేందుకు సన్నాహాలు చేపడుతున్నారు. వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పొత్తు దాదాపు కన్ఫామ్​కాగా, బీఆర్ఎస్, సీపీఎం పొత్తు కుదుర్చుకున్నాయి. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని చెబుతున్నారు.  

బుజ్జగింపుల పర్వం మొదలు..!

పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్, ఫ్రెండ్లీ పోటీల కారణంగా నష్టం జరగడంతో మళ్లీ రిపీట్ కాకుండా కాంగ్రెస్ నేతలు ప్లాన్​చేస్తున్నారు. వార్డుల్లో పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించడంతో కాంగ్రెస్​లో అభ్యర్థుల ఎంపిక.. ఆయా మున్సిపాలిటీల్లో ముఖ్యనేతలకు తలనొప్పిగా మారింది. ఒక వార్డుకు కనీసం నలుగురైదుగురు పోటీలో ఉండడంతో వారిలో నుంచి ఒక్కరిని ఎంపిక చేసి, మిగిలిన వారిని సముదాయించడంతోపాటు రెబల్ గా పోటీ చేయకుండా నామినేటెడ్ పదవులు ఇస్తామని బుజ్జగిస్తున్నారు. 

వాళ్ల అర్హత, అనుభవాన్ని బట్టి ఎంపీటీసీ, జడ్పీసీటీ, ఎంపీపీ పదవులతోపాటు సొసైటీలు, కో ఆప్షన్ సభ్యులు వంటి చాన్స్ ఇస్తామని హామీ ఇస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను కూడా ముందుగా ప్రకటించడం లేదు. ఇప్పుడే ప్రకటిస్తే, అదే రిజర్వేషన్​ కలిసి వచ్చి చైర్మన్ పోస్టుపై కన్నేసిన మిగిలిన వాళ్లు పోటీపై అనాసక్తిగా ఉంటారనే కారణంగా ఎలక్షన్ల తర్వాతే చైర్మన్ అభ్యర్థి ఎంపిక ఉంటుందని చెబుతున్నారు.

తొలిరోజు 7 నామినేషన్లు దాఖలు...

ఖమ్మం జిల్లాలో తొలి రోజు 7 నామినేషన్లు దాఖలయ్యాయి. ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం 117 వార్డులున్నాయి. వీటిలో ఏదులాపురంలో 2, వైరాలో 2, సత్తుపల్లిలో 3 నామినేషన్లు ఫైలయ్యాయి. ఏదులాపురంలో సీపీఎం తరపున ఒకరు, కాంగ్రెస్​ తరపున ఒకటి, వైరాలో బీఆర్ఎస్​తరపున 2, బీజేపీ నుంచి ఒక నామినేషన్ వచ్చినట్టు అధికారులు ప్రకటించారు. కల్లూరు, మధిర మున్సిపాలిటీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు.