కంప్యూటర్ సైన్స్​లో 53 వేల మందికి సీట్లు

కంప్యూటర్ సైన్స్​లో 53 వేల మందికి సీట్లు
  • ఎంసెట్ ఫైనల్​ ఫేజ్​లో 70,627 మందికి అలాట్ మెంట్
  • సగం కూడా భర్తీ కానీ సివిల్, మెకానికల్ సీట్లు 
  • సీట్ల కేటాయింపు వివరాలు వెల్లడించిన విద్యా శాఖ సెక్రటరీ

హైదరాబాద్, వెలుగు: టీఎస్  ఎంసెట్  ఫైనల్  ఫేజ్  సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ పూర్తయింది. ఈ ఫేజ్​లోనూ కంప్యూటర్  సైన్స్ కోర్సుల హవా కొనసాగింది. మొత్తం 70,627 మందికి సీట్లు అలాట్ అయితే, దాంట్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లోనే 53,034 మంది స్టూడెంట్లున్నారు. టీఎస్ ఎంసెట్  ఫైనల్  ఫేజ్  సీట్ల కేటాయింపు వివరాలను బుధవారం విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ విడుదల చేశారు. రాష్ట్రంలో 174 ఇంజినీరింగ్  కాలేజీలు ఉండగా, వాటిలో కన్వీనర్ కోటాలో 83,766  సీట్లు ఉన్నాయి. 

ఫైనల్ ఫేజ్​ సమయానికి 70,627 సీట్లు నిండగా, మరో 13,139 సీట్లు మిగిలాయి. సెకండ్ ఫేజ్  ముగిసే నాటికి 62,738 మంది స్టూడెంట్లు కాలేజీల్లో జాయిన్ అయ్యారు. కాగా, ప్రత్యేకంగా ఫైనల్​ ఫేజ్​లో 35,757 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. అయితే, తక్కువ ఆప్షన్లు ఇచ్చిన 2,575 మందికి సీట్లు అలాట్ కాలేదు. మరోపక్క ఈడబ్ల్యూఎస్ కోటా కింద 5,480 మందికి సీట్లు లభించాయి. రాష్ట్రంలో 30 కాలేజీల్లో వంద శాతం సీట్లు నిండగా, వాటిలో 27 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 11లోగా ఆన్​లైన్​లో సెల్ఫ్  రిపోర్ట్  చేయాలని,12లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు. 

సివిల్, మెకానికల్ లో సగం కూడా నిండని సీట్లు 

ఇంజినీరింగ్  బ్రాండ్  కోర్సులైన సివిల్, మెకానికల్ అనుబంధ కోర్సులకు రోజురోజుకూ డిమాండ్  తగ్గుతోంది. ఫైనల్  ఫేజ్ అలాట్మెంట్ లో ఆయా కోర్సుల్లో మొత్తం 8,187 సీట్లు ఉంటే 3,457 (42 శాతం) సీట్లు మాత్రమే  స్టూడెంట్లకు కేటాయించారు. దీంట్లో మెకానికల్ లో 3,657 సీట్లకు 1,300 నిండగా, సివిల్ ఇంజినీరింగ్​లో 4,043 సీట్లకు 1,761 సీట్లు భర్తీ అయ్యాయి. ఇక కంప్యూటర్  సైన్స్  హవా అలాగే కొనసాగింది. ఈ విభాగంలో మొత్తం 56,811 సీట్లకు 53,034 సీట్లు నిండాయి. సీఎస్ఈలో 23,811 సీట్లకు 22,845 సీట్లు, ఏఐఎంఎల్​లో 12,167 సీట్లకు 11,020 సీట్లు కేటాయించారు.