అమరావతి: సినీ నటుడు అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును ఎత్తివేయాలని కోరుతూ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. రేపు(అక్టోబర్ 21, 2024) ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాలలో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలిచిన శిల్పా రవికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. అల్లు అర్జున్ నంద్యాలకు వస్తున్నారని తెలిసి శిల్పా రవి ఇంటి ముందు అభిమానులు పెద్దఎత్తున గుమిగూడారు. అయితే అప్పటికే సెక్షన్ 144, పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉండటంతో అనుమతి లేకుండా అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సమయంలో అల్లు అర్జున్తో పాటు ఆయన భార్య కూడా నంద్యాల వెళ్లారు. శిల్పా రవికి ఓటేయాలని నంద్యాల ప్రజలను కోరారు.
Also Read :- డార్లింగ్ ప్రభాస్ వచ్చేస్తున్నాడు.. రిలీజ్ టైం చెప్పేసిన మేకర్స్
ఏపీలో టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో అల్లు అర్జున్పై సోషల్ మీడియా వేదికగా జనసేన అభిమానులు దుమ్మెత్తిపోశారు. అప్పటి నుంచి అల్లు అర్జున్ అభిమానులకు, పవన్ అభిమానులకు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. అల్లు అర్జున్ నటించిన తాజా సినిమా పుష్ప 2 డిసెంబర్ 6న విడుదల కానున్న సంగతి తెలిసిందే.