
అల్లు కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. అల్లు అరవింద్ తల్లి, దివంగత ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూశారు. శుక్రవారం అర్థరాత్రి 1:45 గంటలకు వృద్ధాప్య కారణాలతో ఆమె తుదిశ్వాస విడిచారు. శనివారం మధ్యాహ్నం కోకాపేటలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. అల్లు కనకరత్నమ్మ మృతి వార్తతో అల్లు, కొణిదెల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖకు కనకరత్నమ్మ తల్లి కావడంతో చిరంజీవి కుటుంబానికి ఇది తీరని లోటు. ఈ సందర్భంగా చిరంజీవి తన బాధను వ్యక్తం చేస్తూ X (గతంలో ట్విట్టర్)లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. "మా అత్తయ్య గారు.. కీ.శే అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను ఓం శాంతిః" అని పేర్కొన్నారు.
నానమ్మ కనకరత్నమ్మ మరణ వార్త తెలియగానే ముంబైలో షూటింగ్‌లో ఉన్న అల్లు అర్జున్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. నానమ్మ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. గతంలో, 'పుష్ప' సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత జైలు సన్నివేశం నుంచి బయటపడినప్పుడు, అల్లు అర్జున్‌కు నానమ్మే స్వయంగా దిష్టి తీశారు. ఆ సమయంలో ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.. అటు రామ్ చరణ్ కూడా మైసూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అమ్మమ్మ పార్థివదేహానికి నివాళుల్పించారు.
►ALSO READ | Chiranjeevi: అల్లు కుటుంబంలో విషాదం.. అత్తమ్మ మరణంపై చిరంజీవి ఎమోషనల్
అంత్యక్రియల ఏర్పాట్లను అల్లు అరవింద్, చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నారు. త్రివిక్రమ్, ఘట్టమనేని శేషగిరిరావు, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా, మృరళిమోహన్, నాగచైతన్య, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, బన్నీ వాసు, దగ్గుబాటి వెంకటేష్, జీజీవిత రాజశేఖర్, శ్యామలా దేవి, వంటి పలువురు సినీ ప్రముఖులు అల్లు కనకరత్నమ్మ పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె మృతి తెలుగు సినీ పరిశ్రమలో విషాదఛాయలు నింపింది.