
అల్లు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి 1:45 గంటలకు వృద్ధాప్య కారణాలతో ఆమె తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం ఆమె పార్థీవదేహాన్ని అల్లు అరవింద్ నివాసానికి తీసుకొచ్చారు. శనివారం మధ్యాహ్నం కోకాపేటలో అల్లు కనకరత్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.
ఈ విషాద వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. చిరంజీవి సతీమణి సురేఖకు కనకరత్నమ్మ సొంత తల్లి కావడంతో చిరంజీవి కుటుంబానికి ఇది తీరని లోటు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అవుతూ X (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్ చేశారు. "మా అత్తయ్య గారు.. కీ.శే అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను ఓం శాంతిః" అని చిరంజీవి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ALSO READ : మెగాస్టార్ కోసం ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన మహిళ..
మా అత్తయ్య గారు.. కీ.శే అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం.
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 30, 2025
మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.
ఓం శాంతిః 🙏
నానమ్మ చనిపోయినా విషయం తెలియగానే ముంబైలో సినిమా షూటింగ్ పనుల్లో ఉన్న అల్లు అర్జున్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు.. రాంచరణ్ మైసూరు నుంచి మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకుని అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. ప్రస్తుతం అల్లు అరవింద్, చిరంజీవి దగ్గరుండి అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నాగబాబు, పవన్ కల్యాణ్‌లు ఒక పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొనడానికి వైజాగ్ వెళ్లినందున, ఆదివారం హైదరాబాద్ వచ్చి అల్లు అరవింద్ కుటుంబాన్ని కలిసి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేయనున్నారు. సోషల్ మీడియాలో పలువురు సినీ ప్రముఖులు కనకరత్నమ్మ మరణం పట్ల సంతాపం తెలుపుతున్నారు. ఆమె మృతి సినీ పరిశ్రమలో విషాద ఛాయలు నింపింది.