Chiranjeevi : మెగాస్టార్ కోసం ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన మహిళ.. షాకింగ్ గిఫ్ట్ ఇచ్చిన చిరు!

Chiranjeevi : మెగాస్టార్ కోసం ఆదోని నుంచి  సైకిల్‌పై వచ్చిన మహిళ.. షాకింగ్ గిఫ్ట్  ఇచ్చిన చిరు!

మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానులకు ఎంత ప్రేమో మరోసారి రుజువైంది. ఆదోని నుంచి హైదరాబాద్ వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన ఓ మహిళా అభిమానిని చిరంజీవి స్వయంగా కలిసి, ఆమె నిబద్ధతకు సలాం కొట్టారు. ఆమె పేరు రాజేశ్వరి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే, తన ఆరాధ్య నటుడిని చూడాలన్న ఆకాంక్ష ఆమెను ముందుకు నడిపించింది.

రాజేశ్వరి ప్రయాణం గురించి తెలుసుకున్న చిరంజీవి, వెంటనే ఆమెను తన నివాసానికి పిలిపించుకున్నారు. ఈ అరుదైన భేటీ ఎంతో భావోద్వేగంగా సాగింది. ఆమెను  ఆత్మీయంగా తన ఇంటికి చిరంజీవి ఆహ్వానించారు.  రాజేశ్వరి ధైర్యాన్ని, అభిమానాన్ని చూసి చలించిపోయారు. ఆమెకు గుర్తుగా ఓ పట్టు చీరను బహూకరించారు. అభిమానిగా వచ్చిన రాజేశ్వరి, చిరంజీవికి రాఖీ కట్టి తమ బంధాన్ని మరింత దృఢం చేసుకున్నారు.

అంతే కాదు చిరంజీవి తీసుకున్న నిర్ణయం అందరి హృదయాలను గెలుచుకుంది. రాజేశ్వరి పిల్లల చదువు బాధ్యత తాను చూసుకుంటానని, వారికి మంచి భవిష్యత్తు ఉండేలా చూస్తానని మాటిచ్చారు. రాజేశ్వరి చేసిన ప్రయాణం, చిరంజీవితో ఆమె ఆత్మీయ కలయికకు సంబంధించిన వీడియో ప్రస్తుతం  ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ సంఘటన చిరంజీవి గొప్ప మనసును, అభిమానుల పట్ల ఆయనకున్న ప్రేమను మరోసారి చాటి చెప్పిందని అభిమానులు ఫిదా అవుతూ ప్రశంసిస్తున్నారు. 

 

చిరంజీవి తదుపరి సినిమాలు ‘విశ్వంభర’ , ‘మనా శంకర వర ప్రసాద్ గారు’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రానున్న ‘మనా శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతి 2026కి విడుదల కానుంది. ఇక వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ‘విశ్వంభర’ సినిమా వేసవి 2026కి వస్తుందని సమాచారం. చిరంజీవి ఈ సినిమాను ‘చందమామ కథ’లా ఉంటుందని, పిల్లలకే కాకుండా పెద్దల్లోని పిల్లలని కూడా ఆకట్టుకుంటుందని మూవీ మేకర్స్ తెలిపారు.