
- రూ.12 లక్షల క్యాష్, స్కోడా కార్స్వాధీనం
- మహారాష్ట్రలోని రూ.4 కోట్ల విలువైన ఫ్యాక్టరీ సీజ్
- నిజామాబాద్ సీపీ సాయి చైతన్య వెల్లడి
నిజామాబాద్, వెలుగు: మత్తుపదార్థం అల్ఫ్రాజోలంను పట్టుకొని ఇద్దరి అరెస్టు చేశామని నిజామాబాద్ సీపీ సాయిచైతన్య తెలిపారు. దీని విలువ రూ.3 కోట్లు ఉందని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని సతారా ఏరియాలో కెమికల్ఫ్యాక్టరీ నిర్వహణకు మరాఠా ప్రభుత్వ పర్మిషన్పొందిన అమర్‌సింగ్ దేశ్ ముఖ్, అదే ప్రాంతానికి చెందిన బాబూరావు బస్వరాజ్ అలియాస్ప్రసాద్ కడేరి బయో స్టమ్ లెంట్ కంపెనీ నిర్వహిస్తున్నారు. వీరు ముగ్గురూ కలిసి ఫ్యాక్టరీలో అల్ఫ్రాజోలం ఉత్పత్తి చేసి కల్లు వ్యాపారులకు అమ్మడానికి నిజామాబాద్ జిల్లా సాలూరా మండల కేంద్రానికి చెందిన లక్ష్మణ్‌గౌడ్‌ను పెడ్లర్‌గా నియమించుకున్నారు.
తమకు ఏజెంట్లుగా పనిచేసే మహారాష్ట్రకు చెందిన పరమేశ్వర్, షబ్బీర్ ద్వారా రెండున్నర కిలోల అల్ఫ్రోజోలంను లక్ష్మణ్‌గౌడ్ కు ఇవ్వగా.. నిఘా పెట్టి ఈనెల 15న రాత్రి సాలూరాలో పట్టుకున్నామన్నారు. నిందితులను జుడీషియల్కస్టడీకి అప్పగించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్రకు వెళ్లి కెమికల్ఫ్యాక్టరీ నుంచి రూ.3 కోట్ల విలువైన అల్ఫ్రోజోలం పట్టుకున్నామని, రూ.12 లక్షల నగదు, నిందితుల స్కోడా కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు తెలిపారు. అదేవిధంగా రూ.4 కోట్ల విలువైన ఫ్యాక్టరీని సీజ్‌చేశామన్నారు. ప్రధాన నిందితులు అమర్‌సింగ్ దేశ్‌ముఖ్, బాబూరావు బస్వరాజ్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో కీలక రోల్ పోషించిన బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్‌బాబు పోలీస్‌సిబ్బందిని సీపీ అభినందించారు.