ఆర్వోఆర్ చట్టం - 2020, ధరణి పోర్టల్ స్థానంలో 14 ఏప్రిల్ 2025న కొత్త ఆర్వోఆర్ చట్టం, భూ భారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వం చట్టం పేరు ధరణి నుంచి భూ భారతి, ఐఐఎఫ్ఎల్ ప్రైవేట్ సంస్థ నుంచి ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఐసీకి మార్చి పోర్టల్ బాధ్యతలు అప్పజెప్పింది. ఏ చట్టం సజావుగా అమలు జరగాలన్నా రూల్స్ ముఖ్యం. రైతుల సమస్యలు పరిష్కారం దృష్టిలో పెట్టుకొని భూ భారతి చట్టం రూపొందించినా అమలుకోసం అధికారులు రూపొందించిన రూల్స్ రైతులకు శాపంగా మారాయి. ఫలితంగా ఒక్క అప్లికేషన్ కూడా ముందడుగు పడడం లేదు.
చట్టానికి అనుగుణంగా రూల్స్ తయారుచేసి గ్రామపాలన అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఓరియెంటేషన్ చేస్తే ప్రయోజనం ఉంటుంది.
సాదా బైనామాల సాగదీత రైతులు ఏళ్లుగా చెప్పులు అరిగేలా అప్లికేషన్లు పట్టుకొని అధికారులచుట్టూ తిరిగినా.. రెవెన్యూ సదస్సుల పేరుతో సేకరించిన అప్లికేషన్లు పరిష్కారం చేయకుండా తిరస్కరిస్తున్నారు. తొమ్మిది లక్షల సాదా బైనామా అప్లికేషన్లలో మొత్తానికి నోటీసులు ఇచ్చి మూడు లక్షల అప్లికేషన్లు రిజెక్ట్ చేసి, మూడు లక్షల అప్లికేషన్లు పెండింగ్ పెట్టి, ఇంకో మూడు లక్షల అప్లికేషన్లు కుంటిసాకులతో డిస్పోజ్ చేశారు. పరిష్కారం చేసినవి మాత్రం శూన్యం. సాదా బైనామాల దరఖాస్తుదారు అధీనంలో భూమి లేకపోయినా, అమ్మినవారు అఫిడవిట్ ఇవ్వకున్నా, డిమాండ్ నోటీసు ప్రకారం రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించకపోయినా తిరస్కరించాలని ప్రభుత్వం మూడు కారణాలు చూపుతూ సర్క్యులర్ ఇచ్చింది. అయితే ‘అమ్మినవారు అఫిడవిట్ ఇవ్వకున్నా’ అనే కారణానికి ప్రభుత్వం మినహాయింపు ఇవ్వనున్నట్లు మొన్న వార్తలు వచ్చాయి. కానీ, క్షేత్రస్థాయిలో సాదాబైనామా సమస్యలు 15 రకాలుగా ఉన్నాయి. అటు ప్రభుత్వ మార్గదర్శకాలు ఇటు అధికారుల అయోమయం వలన సాదా బైనామాలను సాగదీస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదు.
సెక్షన్ 22A కాపీ పేస్ట్
ధరణి పోర్టల్ సెక్షన్ 22 A నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములను అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ కింద విభజించి 22 A (1) (a), 22 A(1) (b), 22 A(1) (c) - వక్ఫ్, 22 A(1) (c)- ఎండోమెంట్, 22 A(1) (d), 22 A(1) (e), court cases & Others అని చూపిస్తున్నారు. కానీ, గతంలో నిషేధిత భూముల జాబితాలో చేర్చిన రైతుల భూములను తొలగించకుండా సెక్షన్ 22 A(1) (a), (b), (d) భూములకు సంబంధించి జిల్లా కలెక్టర్‌ను సంప్రదించాలని, సెక్షన్ 22 A(1)(c) భూములకు సంబంధించి వక్ఫ్, ఎండోమెంట్ అధికారులను సంప్రదించాలని, సెక్షన్ 22 A(1)(e) భూములకు సంబంధించి సీసీఎల్ఏ అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు.
అప్పీలుపై లేని అవగాహన
భూ చట్టాల న్యాయ నిపుణుల ఆధ్వర్యంలో రూపొందిన భూ భారతి చట్టంలో అధికారులు రైతులకు న్యాయం చేయకుంటే రైతులకు అప్పీలు చేసే అధికారం ఈ చట్టంలో ఉన్నది కానీ రైతులకు అవగాహన లోపం వల్ల అది సాధ్యం కావడం లేదు. ఎమ్మార్వో పై ఆర్డిఓ కు, ఆర్డీవో పై అదనపు కలెక్టర్ కు, అదనపు కలెక్టర్ పై కలెక్టర్ కు అప్పీలు చేసే అవకాశం ఈ చట్టంలో ఉన్నది. గత ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించి గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని చెప్పి 10,954 రెవెన్యూ గ్రామాలకు కేవలం 3,454 గ్రామపాలన అధికారులను నియమించి ఒక్కొక్కరికి రెండు మూడు గ్రామాల బాధ్యతలు అప్పగించి వారికి ఇంకా జాబ్ చార్ట్ ఇవ్వలేదు.
లైసెన్స్డ్ సర్వేయర్లు
ప్రభుత్వం సర్వేయర్ల కొరత ఉన్నా నోటిఫికేషన్ ఇచ్చి వారిని భర్తీ చేయకుండా కొత్తగా ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకానికి తెరలేపింది. వ్యవసాయ భూముల కొనుగోలు, అమ్మకం విషయంలో భవిష్యత్తులో ఎలాంటి సరిహద్దుల వివాదాలకు ఆస్కారం లేకుండా లైసెన్స్డ్ సర్వేయర్ల ద్వారా సర్వే చేసిన తర్వాత ఆ మ్యాప్‌ను మండల సర్వేయర్ అప్రూవ్ చేసిన తర్వాత తహసీల్దార్ భూమి రిజిస్ట్రేషన్ చేస్తారు అని చట్టంలో పొందుపరచి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అమలు జరగడం లేదు. ఇంకా పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
పత్తాలేని ‘స్వామిత్వ’
గతంలో ప్రభుత్వాలు ప్రజలకు, మాజీ సైనికులకు, స్వాతంత్ర్య సమరయోధులకు అసైన్ చేసిన భూముల అమ్మకం కొనుగోలు విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకుండా నిషేధిత జాబితాలో చేర్చారు. గ్రామాలలో ఆబాది, గ్రామకంఠం భూముల సర్వే కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే స్వామిత్వ. ఈ పథకానికి కేంద్రమే డబ్బులు చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలు చేయకుండా గ్రామకంఠం భూములకు పట్టా వచ్చే అవకాశం, అలాగే ఆ పట్టా ద్వారా లోన్లు పొందేమార్గం లేకుండా చేస్తుంది.
స్వామికార్యంలా 'సమగ్ర భూ సర్వే'
తెలంగాణలో నిజాంకాలంలో జరిగిన సర్వే రికార్డులే ఇప్పటికీ ఆధారం. ప్రతీ ముప్పైఏళ్లకోసారి భూముల సర్వే జరిగితేనే రికార్డులు అప్డేట్ అవుతాయి. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్ళు గడుస్తున్నా డిజిటల్ ల్యాండ్ సర్వేకు ప్రభుత్వాలు పూనుకోవడం లేదు. నక్షాలు లేని కేవలం 413 గ్రామాలలో పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాలను ఎంపికచేసి సర్వే చేసింది. ధరణి పోర్టల్ చట్టం ఊరు, పేరు మార్చే తప్ప సమస్యలు తీరడం లేదు. భూ భారతి పేరుతో ప్రస్తుత ప్రభుత్వం కూడా రైతులకు న్యాయం చేయలేకపోతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామాలలో ‘భూ న్యాయ శిబిరాలు’ నిర్వహించి రైతులకు
మేలుచేస్తే బాగుంటుంది.
- బందెల
సురేందర్ రెడ్డి,
మాజీ సైనికుడు
