అదును దాటుతున్న చేప పిల్లలు వదలరాయే..

అదును దాటుతున్న చేప పిల్లలు వదలరాయే..

మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రాజెక్ట్ లు, చెరువులు నిండాయి. కొత్త నీరు చేపల పెంపకానికి అనువుగా ఉంటుంది. ఈ మేరకు మత్స్య సహకార సంఘాలు చేపల పెంపకం చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. మత్స్యశాఖ అధికారులు ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం కింద ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 15 కోట్ల చేప పిల్లలను సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు టెండర్లు కూడా నిర్వహించారు. కానీ అదును దాటిపోతున్నా అధికారులు చేప పిల్లల (సీడ్) పంపింణీ ఇంకా మొదలుపెట్టడంలేదు. దీంతో వేలాది మంది మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. 

ఇదీ పరిస్థితి.. 
 మెదక్​ జిల్లాలోని పోచారం, ఘనపూర్ రిజర్వాయర్లు, 1,617 చెరువులలో చేపల పెంపకం చేపడుతారు. జిల్లా వ్యాప్తంగా 241 మత్స్య సహకార సంఘాలు, 21 మహిళా మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. వాటిలో 15,724 మంది సభ్యులు ఉన్నారు. ఇటీవల వర్షాలతో రెండు రిజర్వాయర్లుతోపాటు అన్ని చెరువులు పూర్తి స్థాయిలో నిండాయి. ఉచిత చేప పిల్లల పథకంలో భాగంగా ఈ సీజన్ లో జిల్లాలోని ఆయా వనరుల్లో 5.04 కోట్ల చేప పిల్లలను వదలాలని మత్స్యశాఖ అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. మెదక్ ఫిష్ ఫామ్ లో 50 లక్షల విత్తన చేప పిల్లలు ఉత్పత్తి చేయగా, మిగతా వాటి సరఫరా కోసం టెండర్లు నిర్వహించారు. కానీ ఇంకా పంపిణీ ప్రక్రియ మొదలు కాలేదు.

సంగారెడ్డి జిల్లాలో 193 సొసైటీలు ఉండగా, వాటిల్లో 10,434 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. ఆయా సొసైటీలు 875 నీటి వనరుల్లో చేపల పెంపకం చేపడుతున్నాయి. ప్రస్తుత సీజన్​లో జిల్లా వ్యాప్తంగా 635 చెరువుల్లో 5.50 కోట్ల చేప పిల్లలను వదలాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు, చెరువులన్నీ నిండి పొంగిపొర్లుతున్నాయి. గతేడాదిలో జులై, ఆగస్టులో480 చెరువుల్లో మొత్తం 3.53 కోట్ల చేపపిల్లలను వదలగా, ఈసారి ఇంకా మొదలు పెట్టలేదు. సిద్దిపేట జిల్లాలోని మొత్తం 22 మండలాల్లో 281 సొసైటీలు ఉండగా,  20,350 మంది సభ్యులు ఉన్నారు. ఈ సీజన్​ లో 1,636 చెరువులతో పాటు రంగనాయక సాగర్, కొండ పొచమ్మ సాగర్ రిజర్వాయర్లలో 4.09 కోట్ల చేప పిల్లలను వదలాలని నిర్ణయించారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయినా ఇంత వరకు చెరువుల్లో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు. 


నాణ్యమైన సీడ్ సప్లై చేయాలి
చెరువులన్నీ నిండాయి. అదును దాటిపోతోంది. వెంటనే చెరువుల్లో చేప పిల్లలను వదలాలె. నాణ్యమైనవి చేప పిల్లలు సప్లై చేసేటట్లు అధికారులు చూడాలె. 

                                                                               - నర్సింలు, మత్స్యకారుడు,తిప్పనగుళ్ల

అగ్రిమెంట్ల ప్రక్రియ పూర్తి కాగానే పంపిణీ..
సిద్దిపేట జిల్లాలో చెరువుల్లో చేప పిల్లల పంపిణీకి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. కాంట్రాక్టర్ల అగ్రిమెంట్లు పూర్తి కాగానే ఆగస్టు రెండో వారం నుంచి జిల్లాలోని 1,636 చెరువుల్లో 4.09 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయనున్నాం.  - మల్లేశం, జిల్లా మత్స్య శాఖ అధికారి, సిద్దిపేట