వార్ మెమొరియల్ లో కలవనున్న అమర్ జవాన్ జ్యోతి

వార్ మెమొరియల్ లో కలవనున్న అమర్ జవాన్ జ్యోతి

ఇండియా గేట్ దగ్గర ఉన్న అమర్ జవాన్ జ్యోతి ఇవాళ ఆరిపోనుంది.  50 ఏళ్లుగా నిర్విరామంగా వెలుగుతున్న ఈ జ్యోతిని నేషనల్ వార్ మెమొరియల్ లో విలీనం చేయనున్నారు. అందుకోసం అమర్ జవాన్ జ్యోతి దగ్గర నుంచి మంటలో కొంత భాగాన్ని ఈ మధ్యాహ్నం నేషనల్ వార్ మెమొరియల్ చిహ్నం వద్దకు తీసుకువెళ్లనున్నారు. అమర్ జవాన్ జ్యోతిని శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్పేసి.. నేషనల్ వార్ మెమొరియల్ వద్ద ఉండే జ్యోతిలో కలుపుతారు. రెండు జ్యోతులు నిర్విరామంగా వెలిగించడం కష్టం అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

‘అమర్‌ జవాన్‌ జ్యోతి జ్వాల ఆరిపోవడం లేదు. దాన్ని జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలో కలిపేస్తున్నారు. అమర్‌ జవాన్‌ జ్యోతిలోని జ్వాల 1971 నాటి అమరవీరులకు నివాళులర్పించడం కోసం ఏర్పాటు చేయబడింది. ఈ జ్యోతి దగ్గర యుద్ధాల పేర్లు కానీ, వాటి పేర్లు కానీ ముద్రించలేదు’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

1971 భారత్ పాక్ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికులకు గుర్తుగా ఇండియా గేటు దగ్గర స్మారకంగా ఈ జ్యోతిని ఏర్పాటుచేశారు. 1972 జనవరి 26న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అమర్ జవాన్ జ్యోతిని వెలిగించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ సైనికుల జ్ఞాపకార్థం బ్రిటిష్ వారు ఇండియా గేట్ నిర్మించారు. మొదటి ప్రపంచ యుద్ధం మరియు ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో బ్రిటిష్ వారి కోసం పోరాడిన వారి పేర్లు ఇండియా గేట్‌పై చెక్కబడి ఉన్నాయి. 

మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ రాజధానిలో 176 కోట్ల వ్యయంతో నేషనల్ వార్ మెమొరియల్ స్మారకాన్ని నిర్మించారు. 2019లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ స్మారకాన్ని ఓపెన్ చేశారు. దీని తర్వాత ఇండియా గేటు దగ్గర జరిగే అన్ని  సైనిక కార్యక్రమాలను నేషనల్ వార్ మెమొరియల్ దగ్గరకు మార్చారు. 

కాగా.. అమరజవాన్ జ్యోతి ఆర్పేయాలన్న నిర్ణయంపై కాంగ్రెస్ మండిపడింది. ధీర సైనికుల గుర్తుగా కొన్ని ఏండ్లుగా వెలుగుతున్న జ్యోతిని నేడు ఆర్పేస్తుండటం తీవ్ర విచారం కలిగిస్తోంది అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కొంత మందికి దేశభక్తి, త్యాగనిరతి ఎన్నటికీ అర్థం కావన్నారు రాహుల్ గాంధీ, సైనికుల కోసం అమరజవాన్ జ్యోతిని తాము మళ్లీ వెలిగిస్తామని రాహుల్ గాంధీ అన్నారు.

For More News..

ప్రపంచాన్ని చుట్టొచ్చిన అతి చిన్న పైలట్

ప్యాసెంజర్ మాస్క్ పెట్టుకోలేదని ఫ్లైట్ నే వెనక్కి మళ్లించారు