పర్యాటకులను ఆకట్టుకునేలా.. అమరగిరి అభివృద్ధికి ప్లాన్‌‌

పర్యాటకులను ఆకట్టుకునేలా..   అమరగిరి అభివృద్ధికి ప్లాన్‌‌
  • రూ.38.61 కోట్లతో డెవలప్‌‌మెంట్‌‌ వర్క్స్‌‌ చేపట్టనున్న ప్రభుత్వం
  • అంతర్జాతీయ ప్రమాణాలతో సౌలత్‌‌ల కల్పన
  • అందుబాటులోకి వెడ్డింగ్‌‌ డెస్టినేషన్‌‌, కాటేజీలు, వాచ్‌‌టవర్‌‌
  • ఈ నెల 18 లోగా ముగియనున్న టెండర్లు
  • ఏడాదిలోగా పనులు పూర్తయ్యేలా కార్యాచరణ

హైదరాబాద్, వెలుగు : నాగర్‌‌ కర్నూల్‌‌ జిల్లా కొల్లాపూర్‌‌ మండలంలోని ‘అమరగిరి ఐల్యాండ్’ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు టూరిజం శాఖ ప్రణాళికలు రూపొందించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో టూరిస్ట్ స్పాట్‌‌గా మార్చేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.38.61 కోట్లతో 23 అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ పనులను ఏడాదిలోగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించిన ఆఫీసర్లు.. ఇప్పటికే టెండర్లను సైతం ఆహ్వానించారు. ఈ నెల 18వ తేదీతో టెండర్ల గడువు ముగియనుంది. ఆ తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు పనులను ప్రారంభించనున్నారు.

ధ్యానలింగం, వాచ్‌‌టవర్‌‌, మెడిటేషన్ సెంటర్‌‌

‘స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌’ పథకం కింద సోమశిల, అమరగిరి, ఈగలపెంట అభివృద్ధికి రూ.68.10 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో అత్యధికంగా అమరగిరి ఐల్యాండ్ కోసం రూ.38.61 కోట్లు కేటాయించారు. సోమశిల వీఐపీ ఘాట్‌‌కు రూ.1.50 కోట్లు, ఈగలపెంట అరైవల్ జోన్‌‌కు నిధులు కేటాయించారు. అమరగిరి ఐల్యాండ్‌‌లో వెడ్డింగ్ డెస్టినేషన్, స్పా ఏరియా, 24 జీ+1 కాటేజీలు (4-6 మంది వసతి), 6 ట్విన్‌‌ కాటేజీలు (2-3 మంది), స్విమ్మింగ్ పూల్, ధ్యానలింగం, వాచ్‌‌ టవర్, మెడిటేషన్, యోగా డెస్క్, కేఫ్‌‌టేరియా, బుకింగ్‌‌ సమాచార కార్యాలయం, హాల్‌‌, వాచ్‌‌ టవర్‌‌, జెట్టీలు, తదితర సౌకర్యాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. నల్లమల అడవులు, కృష్ణా నది సౌందర్యాన్ని పర్యాటకులు ఆస్వాదించేలా వాచ్‌‌ టవర్‌‌ను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులు ఒత్తిడి నుంచి ఉపశమనం, మానసికోల్లాసం అందించేలా సౌకర్యాలు కల్పించనున్నారు. ఆరోగ్యం, ఆహ్లాదం, ఆనందం కలిగించేలా పర్యాటకుల స్వర్గధామంగా.. అమరగిరి ద్వీపాన్ని తీర్చిదిద్దనున్నారు.

పర్యాటకులకు కనువిందు

హైదరాబాద్ నుంచి 188 కిలోమీటర్లు, నాగర్‌‌కర్నూల్ జిల్లా కేంద్రం నుంచి 56 కిలోమీటర్ల దూరంలో అమరగిరి ద్వీపం ఉంది. కొల్లాపూర్‌‌ నుంచి 8 కిలోమీటర్ల బీటీ రోడ్డు ప్రయాణంతో ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. కృష్ణా నది మధ్యలో ఉన్న ఐల్యాండ్.. ప్రకృతి ప్రేమికులను ఎంతో ఆకట్టుకుంటున్నది. టూరిస్టులు పడవల సహాయంతో అంకాలమ్మ కోట, మల్లయ్య సెల వంటి పురాతన ఆలయాలను సందర్శించే అవకాశం ఉంది. శ్రీశైలం బ్యాక్‌‌ వాటర్‌‌, పొగమంచు, మర పడవల్లో నదిపై విహారం పర్యాటకులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వనుంది.

‘తెలంగాణ ఊటి’గా గుర్తింపు

అమరగిరి ఐల్యాండ్ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ఈ ప్రాంతం దేశీయ, విదేశీ పర్యాటకులకు గమ్యస్థానంగా మారనుంది. ప్రకృతి, ఆధ్యాత్మికత, ఆరోగ్యం, సాహసం కలగలిపిన ఈ ద్వీపం తెలంగాణ టూరిజంలో కొత్త ఒరవడిని సృష్టిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. దీనిద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. రాబోయే రోజుల్లో అమరగిరి ‘తెలంగాణ ఊటి’గా గుర్తింపు పొందనుంది.- మంత్రి జూపల్లి కృష్ణారావు