
- వర్షాల కారణంగా గురువారం యాత్ర నిలిపివేత
జమ్మూ: అమర్‌నాథ్ యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని గండేర్‌బల్ జిల్లాలోని బాల్టాల్ మార్గంలో బుధవారం సాయంత్రం బండరాయి తగిలి ఒక మహిళా యాత్రికురాలు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనతో పాటు గత 36 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం అమర్‌నాథ్ యాత్రను పహల్గామ్, బాల్టాల్ బేస్ క్యాంపుల నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈ సంవత్సరం జమ్మూ నుంచి యాత్ర నిలిపివేయడం ఇదే మొదటిసారి. మృతురాలిని రాజస్థాన్‌కు చెందిన 55 ఏండ్ల సోనా బాయిగా గుర్తించారు. గాయపడిన ముగ్గురు యాత్రికులను ఆస్పత్రిలో చేర్చినట్టు తెలిపారు. గత రెండ్రోజులుగా జమ్మూ కాశ్మీర్‌లోని యాత్ర మార్గాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైల్‌పత్రీ, బ్రారీమార్గ్ మధ్య జెడ్-టర్న్ వద్ద కొండచరియలు విరిగిపడడంతో వందల మంది యాత్రికులు చిక్కుకుపోయారు.
భారత సైన్యం సుమారు 3,500 మంది యాత్రికులను సురక్షితంగా రక్షించి, 3 వేల మందిని అత్యవసర లంగర్‌లలో ఆశ్రయం కల్పించింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే శుక్రవారం నుంచి యాత్ర తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.