శ్రీనగర్: భారీ వర్షాల కారణంగా వరుసగా రెండో రోజు అమర్నాథ్ యాత్రను రద్దు చేశారు. గత వారం రోజులుగా జమ్ము కశ్మీర్లోని పహల్గాం, బల్తల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అమర్నాథ్ యాత్ర ఈ మార్గాల నుంచే సాగాల్సి ఉండటంతో యాత్రికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మంగళవారం రోజు అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా రద్దు చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించారు.
జూన్ 29న అమర్నాథ్ యాత్ర మొదలైన సంగతి తెలిసిందే. గతేడాది 4.4 లక్షల మంది భక్తులు మంచుకొండల్లో ఉండే శివలింగాన్ని దర్శించుకున్నారు. 62 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో 48 మంది మరణించారని, 62 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. వాతావరణ సంబంధిత, సాధారణ కారణాలతో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. 2022లో 3.65లక్షల మంది అమర్‌నాథ్ శివలింగాన్ని దర్శించుకోగా.. 2023కు ఆ సంఖ్య 4.4లక్షలకు చేరుకోవడం గమనార్హం.
#WATCH | J&K: Amarnath Yatra has been suspended on both Pahalgam and Baltal routes due to inclement weather on the yatra routes.
— ANI (@ANI) August 13, 2024
Visuals this morning, from Pantha Chowk base camp in Srinagar. pic.twitter.com/XukQuh0XTM
అమర్‌నాథ్‌కు పెహల్‌గాం నుంచి కాలినడకన వెళ్లాలి. ఇది అనంతనాగ్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. లిద్దర్ నదీ తీరంలో పెహల్‌గాం ఉంది. ఇది పర్వత పట్టణం. సముద్రమట్టానికి 7,200 మీటర్ల ఎత్తున ఉంది. అమర్‌నాథ్ యాత్ర మొదలయ్యే ప్రాంతాలలో ఇది ముఖ్యమైనది. అందమైన పచ్చిక మైదానాలకు, దట్టమైన పైన్ అరణ్యాలకు ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. అమర్‌నాథ్ యాత్ర ప్రాచీన కాలం నుంచీ ఉంది. కశ్మీర్ రాజుల చరిత్ర వివరించే ‘రాజతరింగిణి’లో అమర్‌నాథ్ క్షేత్ర ప్రస్తావన ఉంది. రాణి సూర్యమతి అమరనాథ్ శివుడికి త్రిశూలం, బాణ లింగాలు సమర్పించినట్టు ఆ గ్రంథంలో పేర్కొన్నారు. ప్రజయభట్టు రాసిన ‘రాజవిప్లతక’లో కూడా అమర్నాథ్ యాత్రా విశేషాల ప్రస్తావన ఉంది.
ప్రపంచంలోని అతిపెద్ద గుహల్లో అమర్‌నాథ్ గుహ ఒకటి. 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవు ఉన్న గుహ ఇది. దీనిని చూసేందుకు ఏటా ఎంతో మంది యాత్రికులు తరలివస్తున్నారు. శీతాకాలంలో పేరుకుపోయిన మంచు నెమ్మదిగా తొలగిపోతూ అమర్‌నాథ్ యాత్రకు దారి చూపుతోంది. మే నుంచి ఆగస్టు వరకు హిమాలయాలలో మంచు కరగడం వల్ల ఈ గుహ మంచు నుంచి బయటపడి, సందర్శనకు వీలుగా ఉంటుంది. గుహలోని మంచు తేరుకుంటున్న వేళ నీటిబొట్టు మంచుగా మారి శివలింగాకారం ధరిస్తోంది. ఈ అద్భుతాన్ని దర్శించుకునేందుకు జూలై, ఆగస్టు అనుకూలమైన రోజులు.
ప్రతి ఏటా జూలైలో అమర్‌నాథ్‌కు యాత్ర మొదలవుతుంది. ఈ క్షేత్రానికి పహల్ గాం గ్రామం నుంచి వెళ్ళాలి. ఇది అతి కష్టమైన యాత్ర. జ్యోతిర్లింగాలలో అమర్‌నాథ్‌లోని మంచులింగం ఒకటి. కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌కు 141 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ గుహలో ఇప్పుడు శివుడు కొలువుదీరుతాడు.గుహలో మంచులింగం ఏటా ఒకే చోట ఏర్పడుతుంది. ఒకే ఎత్తులో ఏర్పడటం విశేషం. గుహలో పైనుంచి బొట్టుబొట్టుగా పడే నీరు ఈ గుహలో మంచురూపంలోకి మారుతుంది. ఈ మంచు శివలింగాకారంలో ఉంటుంది. ఈ కాలంలో కైలాస పర్వతం నుంచి శివుడు ఇక్కడికి వస్తాడని భక్తుల నమ్మకం. ఆ శివుడిని దర్శించుకోవాలని వాళ్ల కోరిక. మృత్యు రహస్యం తెలిసిన శివుడు తన సతి పార్వతికి ఈ గుహలోనే ఆ రహస్యం చెప్పాడట. ఈ గుహలో మంచులింగం పక్కనే రెండు మంచు ఆకారాలు ఏర్పడతాయి. వాటిలో ఒకదానిని పార్వతిగా, మరోదానిని విఘ్నేశ్వరుడిగా భావిస్తారు. 45 రోజులపాటు ఈ మంచులింగం కనిపిస్తుంది.