
హైదరాబాద్, వెలుగు: ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ను ఈ నెల 23 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. పండుగ సీజన్‌ను పురస్కరించుకుని నిర్వహించే ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్, నిత్యావసరాలు వంటి అనేక రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు లభించనున్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఈ సేల్ ఒకరోజు ముందుగా అంటే సెప్టెంబర్ 22న ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా, అమెజాన్ వివిధ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ఇస్తున్నట్టు తెలిపింది. అమెజాన్ పండుగ సీజన్ కోసం తమ కార్యకలాపాలను పెంచుకోవడానికి రూ. 2,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. డెలివరీ వేగాన్ని పెంచడానికి, లాజిస్టిక్స్ నెట్వర్క్‌ను విస్తరించడానికి, ఉద్యోగుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి ఈ డబ్బును వాడుతారు. కంపెనీ టైర్-2, టైర్-3 నగరాల్లో ఐదు కొత్త ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, 30 కొత్త డెలివరీ స్టేషన్లను ప్రారంభించింది. ఈ పండుగ సీజన్లో 140 కోట్లకు పైగా కస్టమర్ల విజిట్స్ ఉంటాయని అమెజాన్ అంచనా వేస్తోంది.