V6 News

ఖర్చులు తగ్గించుకునేందుకు లేఆఫ్స్ చేయట్లే.. అసలు విషయం చెప్పిన అమెజాన్

ఖర్చులు తగ్గించుకునేందుకు లేఆఫ్స్ చేయట్లే.. అసలు విషయం చెప్పిన అమెజాన్

టెక్ దిగ్గజం అమెజాన్ అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా 14వేల ఉద్యోగాలను తొలగించింది. వాటిలో భారతదేశంలో సుమారు 800 నుంచి 1,000 ఉద్యోగాలు ఉండటంపై కంపెనీ కీలక వివరణ ఇచ్చింది. ఈ లేఆఫ్స్ కేవలం ఖర్చులను తగ్గించుకోవడానికి చేసిన చర్య కాదని, కంపెనీ నిర్మాణాన్ని సరళీకృతం చేసి, మేనేజ్మెంట్ లేయర్స్ తగ్గించడం ద్వారా వేగంగా పనిచేసే సంస్కృతిని ప్రోత్సహించడమే అసలు లక్ష్యమని అమెజాన్ స్పష్టం చేసింది.

అమెజాన్ ఎమర్జింగ్ మార్కెట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. "మేము ఒక స్టార్టప్ లాగా చురుకుగా ఉండాలని, త్వరగా కదలాలని కోరుకుంటున్నాము. ఇందుకోసం తక్కువ మేనేజ్మెంట్ లేయర్స్ అవసరం. ఉద్యోగుల తొలగింపు ప్రధానంగా ఆ పొరలను తొలగించడం గురించే జరిగింది" అని తెలిపారు. సీఈఓ ఆండీ జస్సీ కూడా ఈ నిర్ణయం ఆర్థిక లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణాల కంటే ఎక్కువగా 'సంస్కృతి'కి సంబంధించినదని స్పష్టం చేశారు.

మరోవైపు భారత్‌లో తమ విస్తరణ ప్రణాళికలపై అమెజాన్ భారీ ప్లాన్ ప్రకటించింది. గతంలో సుమారు 40 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన కంపెనీ.. తాజాగా దేశంలో మరో 35 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం సుమారు రూ. 2.9 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ తాజా పెట్టుబడులు మూడు ప్రధాన రంగాలపై దృష్టి సారించనున్నాయి. AI-ఆధారిత డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయడం, భారతదేశ ఎగుమతి వ్యవస్థను బలోపేతం చేయడం.. కొత్త ఉపాధి అవకాశాలను కల్పించడంగా తెలుస్తోంది.

35 బిలియన్ డాలర్ల కొత్త పెట్టుబడి ద్వారా 2030 నాటికి దేశంలో అదనంగా 10 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారత మార్కెట్‌పై తమ దీర్ఘకాలిక దృష్టి చెక్కుచెదరలేదని రుజువు చేస్తోంది. అమెజాన్ వృద్ధి 'ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్' లక్ష్యానికి అనుగుణంగా ఉందని అమిత్ అగర్వాల్ పేర్కొన్నారు.