అమెజాన్​లో విత్తనాలు, యూరియా

అమెజాన్​లో విత్తనాలు, యూరియా

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగుఫోన్ల నుంచి పిడకల దాక దాదాపు ప్రతి వస్తువును అమ్మే ఆన్​లైన్​సంస్థ అమెజాన్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కస్టమర్లు, వేల కోట్ల వ్యాపారం దీని సొంతం. ఇటీవల వ్యవసాయ అనుబంధ ప్రొడక్టులను అమ్ముతోంది. యూరియా, పురుగుల మందులు, విత్తనాలు కూడా విక్రయిస్తోంది. అయితే ఇందుకు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. చట్టాలను పట్టించుకోవడం లేదు. ఫర్టిలైజర్‌‌‌‌‌‌‌‌, పెస్టిసైడ్స్‌‌‌‌‌‌‌‌, విత్తన చట్టాలను ఉల్లంఘించి ప్రమాదకరమైన పురుగు మందులను అమ్ముతోంది. అనుమతి లేని, నిషేధించిన రసాయనాలు, మందులను ఇష్టారాజ్యంగా సేల్ చేస్తోంది.

రూల్స్ ఏం చెబుతున్నాయంటే..

సాధారణంగా పురుగు మందులు తయారు చేయాలన్నా, అమ్మాలన్నా పెస్టిసైడ్స్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌–1968 ప్రకారం అనుమతి పొందాలి. వ్యవసాయ శాఖ నుంచి అనుమతి తీసుకుని ఫర్టిలైజర్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు, రిటైల్‌‌‌‌‌‌‌‌ షాపులు మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకురావాలి. కానీ ఇవేవీ లేకుండా అడిగిందే తడవుగా పురుగుమందులను ఇంటి గుమ్మంలోకి సరఫరా చేస్తోంది అమెజాన్‌‌‌‌‌‌‌‌. అత్యంత ప్రమాదకరమైన కోరజోన్‌‌‌‌‌‌‌‌, క్లోరోఫైరోపాస్‌‌‌‌‌‌‌‌, మోనోక్రోటోపాస్‌‌‌‌‌‌‌‌ తదితర రసాయన పురుగు మందులు నేరుగా వినియోగదారులకు చేర్చుతోంది. అంతేకాదు నిషేధిత పురుగు మందులను కూడా అమ్ముతోంది. పత్తి పంటల్లో వినియోగించే గ్లైఫోసేట్‌‌‌‌‌‌‌‌ను అక్టోబరు 30 వరకు నిషేధిస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ ఇటీవల జీవో జారీ చేసింది. కానీ ఇవి అమెజాన్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. గతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్‌‌‌‌‌‌‌‌లో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ విక్రయాలతో పెనుప్రమాదం పొంచి ఉందని వ్యవసాయ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యూరియా, డీఏపీ కూడా..

ప్రభుత్వం సబ్సిడీతో సరఫరా చేసే యూరియా, డీఏపీలు కూడా అమెజాన్ విక్రయిస్తోంది. యూరియా 50 కిలోల బస్తాను ప్రభుత్వం రూ.262కు అందిస్తుంది. అంటే కిలో ధర రూ.6 కంటే తక్కువగానే పడుతుంది. కానీ అమెజాన్‌‌‌‌‌‌‌‌ కిలో రూ.115కు విక్రయిస్తోంది. డీఏపీ 50 కిలోల బస్తా రూ.1,200 వరకు ఉండగా కిలో రూ.30 వరకు ఉంటోంది. కానీ అమెజాన్‌‌‌‌‌‌‌‌ రూ.152 వరకు విక్రయిస్తోంది.

విత్తన చట్టాల ఉల్లంఘనే

విత్తన చట్టం–1966 ప్రకారమే విత్తనాలు అమ్మాలి. కంపెనీలు జారీ చేసే ఓ–ఫారంతోనే డీలర్లు, రీటైలర్లు విక్రయించుకోవాలి. లేకుంటే శిక్షార్హులే. పత్తి విత్తనాలు మార్కెట్ లో 450 గ్రాములు రూ.730కి లభ్యమవుతుండగా.. అమెజాన్‌‌‌‌‌‌‌‌లో వ్యవహారం భిన్నంగా ఉంది. కేవలం 25 పత్తి విత్తనాలు ఉండే చిన్న ప్యాకెట్‌‌‌‌‌‌‌‌ రూ.149 అమ్ముతున్నారు. ఫుడ్‌‌‌‌‌‌‌‌, పెస్టిసైడ్స్‌‌‌‌‌‌‌‌ కలిపి అమ్మకుండా.. రూల్స్ ప్రకారమే పెస్టిసైడ్స్‌‌‌‌‌‌‌‌ విక్రయించేందుకు లైసెన్స్‌‌‌‌‌‌‌‌లు ఇస్తామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. క్రిమిసంహారక మందులు తయారు చేసే కంపెనీల నుంచి ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌ తీసుకుని, మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ చేసుకునేందుకు అనుమతి తీసుకుంటామని ఫర్టిలైజర్‌‌‌‌‌‌‌‌ డీలర్లు, రిటైలర్లు చెబుతున్నారు. మరోవైపు నిషేధిత రసాయనాలు అమ్మితే ఫర్టిలైజర్‌‌‌‌‌‌‌‌ షాపుల లైసెన్స్‌‌‌‌‌‌‌‌లు రద్దు చేస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ షాపింగ్‌‌‌‌‌‌‌‌పై చర్యలు తీసుకునేందుకు తమ వద్ద ఎలాంటి చట్టాలు లేవంటున్నారు. చట్టాలు ఉల్లంఘించి అమ్మకాలు సాగిస్తే చీటింగ్‌‌‌‌‌‌‌‌ కేసు పెట్టేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చిస్తామని అంటున్నారు.

లా ఎక్స్​పర్టుల సలహా తర్వాత చర్యలు

ఇన్‌‌‌‌‌‌‌‌సెక్టిసైడ్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌, సీడ్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌ చాలా ఏళ్ల కిందట ఏర్పాటయ్యాయి. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ సేల్స్ సంస్థలు ఈ మధ్య వచ్చాయి. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ సంస్థలకు సంబంధించి ఈ చట్టాల్లో ఎలాంటి నిబంధనలు లేవు. అమెజాన్‌‌‌‌‌‌‌‌ లో పురుగుమందులు, విత్తనాలు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. దీనిపై న్యాయ నిపుణుల నుంచి ఒపీనియన్‌‌‌‌‌‌‌‌ తీసుకుని అవసరమైతే చర్యలు తీసుకుంటాం.

– సి.పార్థసారథి, ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ, వ్యవసాయ శాఖ

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి