చిన్న వ్యాపారులకు అమెజాన్​ ఆసరా

చిన్న వ్యాపారులకు అమెజాన్​ ఆసరా

బిలియన్​ డాలర్ల పెట్టుబడి సాయం ప్రకటించిన బెజోస్​

ఎస్‌‌ఎంబీలకు సాయం చేసేందుకే

ఇప్పటికే 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్‌‌ చేశాం

ఇండియా మాకు చాలా ముఖ్యం

అమెజాన్‌‌ ఫౌండర్‌‌ జెఫ్‌‌ బెజోస్‌‌

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోటి చిన్న, మధ్యతరహా కంపెనీలు (ఎస్‌‌ఎంబీలు) తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఇండియాలో మరో  బిలియన్‌‌ డాలర్లు (దాదాపు రూ.7,100 కోట్లు) ఇన్వెస్ట్‌‌ చేస్తామని ప్రముఖ ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీ అమెజాన్‌‌ ఫౌండర్‌‌, సీఈఓ జెఫ్‌‌ బెజోస్‌‌ ప్రకటించారు. ఆన్‌‌లైన్‌‌లో వాటి ప్రొడక్టులను అమ్ముకునేందుకు సాయపడతాయని ప్రకటించారు. అమెజాన్‌‌కు వ్యతిరేకంగా రిటైలర్లు ఆందోళన చేస్తున్న రోజే బెజోస్‌‌ ఈ ప్రకటన చేయడం తెలిసిందే. మరోవైప్‌‌ ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీల వ్యాపార విధానాల వల్ల చిన్న వ్యాపారులు దెబ్బతింటున్నారనే ఆరోపణలపై విచారణ చేస్తున్నట్టు కాంపిటిషన్‌‌ కమిషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా ప్రకటించింది. 2013 నుంచి ఇండియాలో ఐదు బిలియన్‌‌ డాలర్లు ఇన్వెస్ట్‌‌ చేశామని, 2025 నాటికి ఇక్కడి నుంచి10 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అవుతాయని బెజోస్‌‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇండియాదే ఈ సెంచరీ…

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు అయిన బెజోస్‌‌ మూడు రోజుల టూర్‌‌ కోసం మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. ఇక్కడే జరుగుతున్న అమెజాన్‌‌ సంభవ్‌‌ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఎస్‌‌ఎంబీల కోసం అమెజాన్‌‌ ఈ కార్యక్రమం నిర్వహించింది. కంపెనీ ఇండియా హెడ్‌‌ అమిత్‌‌ అగర్వాల్‌‌తో కలిసి బెజోస్‌‌ ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘21వ శతాబ్దం ఇండియా శతాబ్దమన్నది నా అంచనా. దేశం అన్ని రకాలుగా అభివృద్ధి సాధిస్తుండటాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఇండియా ప్రత్యేకమైనది. అమెరికా–ఇండియా ఒప్పందాలు  అతిముఖ్యమైనవి’’ అని కామెంట్‌‌ చేశారు.