V6 News

ఇండియాలో అమెజాన్‌ రూ.3.15 లక్షల కోట్ల పెట్టుబడి.. 2030 నాటికి ఏఐ, లాజిస్టిక్స్‌‌‌‌‌‌‌‌ సెక్టార్లలో.. భారీగా ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటన

ఇండియాలో అమెజాన్‌ రూ.3.15 లక్షల కోట్ల పెట్టుబడి.. 2030 నాటికి ఏఐ, లాజిస్టిక్స్‌‌‌‌‌‌‌‌ సెక్టార్లలో.. భారీగా ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటన
  • 10 లక్షల కొత్త జాబ్స్‌‌‌‌, రూ.7.20 లక్షల కోట్ల ఎగుమతులే కంపెనీ లక్ష్యం
  • 1.5 కోట్ల చిన్న వ్యాపారులు, కోట్లాది వినియోగదారులకు ఏఐ ప్రయోజనాలు
  • 40 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ విద్య, కెరీర్ అవకాశాలు

అమెరికన్ టెక్‌ దిగ్గజాలు ఇండియా బాట పట్టాయి. ఇప్పటికే గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌  రూ.లక్షన్నర కోట్ల చొప్పున పెట్టుబడి ప్రకటించగా.. తాజాగా అమెజాన్ 35 బిలియన్ డాలర్లు (రూ.3.15 లక్షల కోట్లు) పెట్టుబడి పెడతామని పేర్కొంది.

న్యూఢిల్లీ: అమెరికన్ టెక్‌‌‌‌‌‌‌‌ దిగ్గజాలు ఇండియా బాట పడుతున్నాయి. ఇప్పటికే గూగుల్‌‌‌‌‌‌‌‌, మైక్రోసాఫ్ట్‌‌‌‌‌‌‌‌  సుమారు రూ.లక్షన్నర కోట్ల చొప్పున పెట్టుబడి ప్రకటించగా, తాజాగా ఈ లిస్ట్‌‌‌‌‌‌‌‌లోకి ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్ చేరింది. భారత్‌‌‌‌‌‌‌‌లో తమ బిజినెస్‌‌‌‌‌‌‌‌ను భారీగా విస్తరిస్తామని న్యూఢిల్లో జరుగుతున్న ‘అమెజాన్ సంభవ్‌‌ సమ్మిట్‌‌’ ఆరో ఎడిషన్‌‌లో ప్రకటించింది. 2030 నాటికి 35 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.15 లక్షల కోట్లు)  పెట్టుబడి పెడతామని పేర్కొంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ (ఏఐ),  లాజిస్టిక్స్ రంగాలపై కంపెనీ దృష్టి సారించనుంది.

అమెజాన్‌‌‌‌ 2010లో ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు  సుమారు  40 బిలియన్ డాలర్లు (రూ.3.60 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. అమెజాన్‌‌‌‌‌‌‌‌కు ఇండియా అతి పెద్ద ఇంటర్నేషనల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌.  ఏఐ టెక్నాలజీని మెరుగుపరచడం, ఉద్యోగావకాశాలు సృష్టించడం, డెలివరీ వ్యవస్థను విస్తరించడం, పెరుగుతున్న ఈ-–కామర్స్ పోటీలో ఆధిపత్యాన్ని బలోపేతం చేయడం వంటివి లక్ష్యంగా  పెట్టుకుంది.

లక్షలాది ఉద్యోగాలు..
2030 నాటికి 10 లక్షల కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని అమెజాన్ పేర్కొంది. అలానే 80 బిలియన్ డాలర్ల (రూ.7.20 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులు సాధించడం,  1.5 కోట్ల చిన్న వ్యాపారులు, కోట్లాది వినియోగదారులకు ఏఐ ప్రయోజనాలు అందించడం, 40 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ విద్య, కెరీర్ అవకాశాలు కల్పించడం తమ లక్ష్యమని వివరించింది.

క్విక్‌‌‌‌‌‌‌‌ కామర్స్‌‌‌‌‌‌‌‌పై ఫోకస్‌‌‌‌‌‌‌‌..
అమెజాన్‌‌‌‌‌‌‌‌ 10 నిమిషాల డెలివరీల విభాగంలో దూసుకెళ్తోంది. కంపెనీకి బ్లింకిట్‌‌‌‌‌‌‌‌, ఇన్‌‌‌‌‌‌‌‌స్టామార్ట్‌‌‌‌‌‌‌‌, జెప్టో, బిగ్‌‌‌‌‌‌‌‌బాస్కెట్‌‌‌‌‌‌‌‌, ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌ మినిట్స్‌‌‌‌‌‌‌‌ నుంచి  తీవ్ర పోటీ ఎదురవుతోంది.  ప్రస్తుతం  ప్రధాన నగరాల్లో రోజుకు రెండు కొత్త డార్క్ స్టోర్లు ప్రారంభిస్తుండగా, ఏడాది చివరికి 300 లొకేషన్లలో స్టోర్లు ఓపెన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.    అమెజాన్‌‌‌‌‌‌‌‌  సెల్లర్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌  ఆదాయం 2024–25లో రూ.30,139 కోట్లుగా నమోదైంది. 

ఈ ఏడాది ఏఐలో వచ్చిన పెద్ద పెట్టుబడులు 
ఈ ఏడాది ఇండియా ఏఐ, సెమీకండక్టర్, క్లౌడ్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్లలోకి భారీగా పెట్టుబడులు వచ్చాయి.
* ఇండియాలో ఏఐ, క్లౌడ్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డెవలప్ చేసేందుకు సుమారు రూ.1.57 లక్షల కోట్లు (17.5 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేస్తామని మైక్రోసాఫ్ట్   ప్రకటించింది. 
* రూ.1.35 లక్షల కోట్ల (15 బిలియన్ డాలర్ల) పెట్టుబడితో విశాఖపట్నంలో అతిపెద్ద ఏఐ హబ్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయడానికి గూగుల్‌‌‌‌‌‌‌‌ ముందుకొచ్చింది.
* ఇంటెల్‌‌‌‌‌‌‌‌ – టాటా ఎలక్ట్రానిక్స్  భాగస్వామ్యం: గుజరాత్‌‌‌‌‌‌‌‌లో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్, అస్సాంలో అసెంబ్లీ యూనిట్‌‌‌‌‌‌‌‌ ద్వారా  ఇంటెల్‌‌‌‌‌‌‌‌ చిప్స్, ఏఐ ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌లను టాటా ఎలక్ట్రానిక్స్ తయారు చేయనుంది. ఈ రెండు కంపెనీలు   రూ.1.26 లక్షల కోట్లు (14 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనున్నాయి.
* మెటా 5‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 వేల కిలోమీటర్ల సబ్‌‌‌‌‌‌‌‌సీ కేబుల్స్ ఏర్పాటు చేయడానికి ఇండియాలో  భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. అంతేకాకుండా రిలయన్స్ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ ఏఐలో అంబానీ, గూగుల్‌‌‌‌‌‌‌‌తో భాగస్వామ్యం అయ్యింది.గూగుల్‌‌‌‌‌‌‌‌తో కలిసి సబ్‌‌‌‌‌‌‌‌మెరైన్‌‌‌‌‌‌‌‌ ఆప్టిక్ ఫైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాను డెవలప్ చేయనుంది. 
* ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కూడా ఇండియా ఏఐ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీగా ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది.
* ప్రభుత్వం ఇండియా సెమికండక్టర్ మిషన్ కింద ఇప్పటికే  రూ.1.64 లక్షల కోట్ల (18.23 బిలియన్ డాలర్ల) విలువైన 10 ప్రాజెక్టులను ఆమోదించింది.