
Kelvinator: దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటి రిలయన్స్ ఇండస్ట్రీస్. ప్రస్తుతం దీనికి అధిపతిగా ముఖేష్ అంబానీ ఉన్నప్పటికీ ఆయన అనేక వ్యాపార బాధ్యతలను తన వారసులకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రిలయన్స్ రిటైల్ విభాగాన్ని కుమార్తె ఇషాకు అప్పగించారు అంబానీ. ఆమె రాకతో కంపెనీ ఒక్క బ్రాండ్లతో జతకట్టడం, అనేక కంపెనీలను కొనుగోలు చేయటంతో దూకుడు విస్తరణను చూస్తోంది. ఈ క్రమంలో ఇషా మరో కొత్త కంపెనీని రిలయన్స్ రిటైల్ కిందికి తీసుకొచ్చారు.
వివరాల్లోకి వెళితే రిలయన్స్ రిటైల్ ప్రముఖ గృహోపకరణాల సంస్థ కెల్వినేటర్ బ్రాండ్ ను కొనుగోలు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. దీంతో కంపెనీ దేశంలోని పెరుగుతున్న కన్జూమర్ డ్యూరబుల్ మార్కెట్లో సొంత ప్రీమియం గృహోపకరణాల మార్కెట్‌ను టార్గెట్ చేయాలని నిర్ణయించింది. తాజా డీల్ ద్వారా దేశీయ వినియోగదారులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తయారు చేయబడిన వస్తువులు, గృహోపకరణాలను అందుబాటు రేట్లలోకి తీసుకురావాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది.
కెల్వినేటర్ సంస్థ 1970-80ల కాలంలో ఇళ్లలో వినియోగించే రెఫ్రిజరేటర్ల తయారీలో అగ్రగామిగా పేరొందింది. అయితే బ్రాండ్ కొనుగోలు రిలయన్స్ సంస్థకు అదనపు విలువను తెచ్చిపెడుతుందని గ్రూప్ నమ్ముతోంది. ఈ ప్రయత్నంతో ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, వస్తువులను భారతీయ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటమే తమ లక్ష్యం అని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ వెల్లడించారు. అలాగే తమకు ఉన్న రిటైల్ వ్యాపారం విక్రయాలకు దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు.