
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై పరోక్షంగా సెటైర్లు విసురుతాడనే పేరుంది. ఎప్పుడు ఇంటర్వ్యూ జరిగినా ఆర్సీబీకి ఒక్క టైటిల్ కూడా లేదని తనదైన శైలిలో విమర్శిస్తూ ఉంటాడు. ఈ విషయం ఆర్సీబీ ఫ్యాన్స్ ను నొప్పించినా రాయుడు మాత్రం తన పంథా మార్చుకోనట్టు తెలుస్తోంది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ప్రశంసిస్తూనే సరదాగా ఒక పంచ్ విసిరాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రోఫీకి తెర పడినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని తన సంతోషాన్ని వ్యక్తం చేసి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో పోల్చి చూశాడు.
ఇటీవల శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రాయుడు..ఆర్సీబీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాయుడు మాట్లాడుతూ.. "RCB టైటిల్ గెలిచినప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా కాలనీలో ప్రజలు క్రాకర్లు కాల్చి సెలెబ్రేట్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారు. నా అభిప్రాయం ప్రకారం ఆర్సీబీ 18 సంవత్సరాల తర్వాత టైటిల్ గెలుచుకుంటే, వారు ఐదు టైటిల్స్ గెలవడానికి 72 సంవత్సరాలు పడుతుంది. వారు కొంచెం వేగం పెంచాలి. ఆర్సీబీ సరైన మార్గంలో ఉందని నేను భావిస్తున్నాను. వారు ఆడుతున్న విధానాన్ని నేను నిజంగా ఆస్వాదిస్తున్నాను." అని రాయుడు చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓవరాల్ గా 5 ఐపీఎల్ టైటిల్స్ గెలిచింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం 18 సీజన్ ల తర్వాత 2025లో తొలి ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది. ఐదు టైటిల్స్ అని ప్రత్యేకంగా గుర్తు చేయడంతో ఫ్యాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో పోల్చి చూస్తున్నట్టు ఫిక్సయ్యారు. ఐపీఎల్ లో రాయుడు ఆరు టైటిల్స్ గెలుచుకున్నాడు. ముంబైతో (2013, 2015, 2017) మూడు టైటిళ్లు.. ఆ తర్వాత CSKతో (2018, 2021, 2023) మరో మూడు టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
రాయుడు కెరీర్ విషయానికి వస్తే 55 వన్డే మ్యాచ్ ల్లో 47 యావరేజ్ తో 1694 పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్ లో పెద్దగా రాణించలేదు. 2019 వరల్డ్ కప్ సమయంలో టీమిండియా స్క్వాడ్ లో స్థానం సంపాదించుకోలేకపోవడంతో మనస్తాపానికి గురైన రాయడు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఐపీఎల్ టోర్నీల్లో ఆడుతూ తన క్రికెట్ కెరీర్ ను కొన్నేళ్ల పాటు కొనసాగించాడు. 2023 ఐపీఎల్ లో చెన్నై తరపున చివరి సీజన్ ఆడిన రాయుడు క్రికెట్ కు గుడ్ బై చెప్పి కామెంట్రీ అవతారం ఎత్తాడు.