అంబేద్కర్ భవన్‌‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తం: వివేక్ వెంకటస్వామి

అంబేద్కర్ భవన్‌‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తం: వివేక్ వెంకటస్వామి

ముషీరాబాద్, వెలుగు :  హైదరాబాద్‌‌లోని లోయర్ ట్యాంక్ బండ్‌‌లో ఉన్న అంబేద్కర్ భవన్‌‌ను అన్ని విధాలుగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం అంబేద్కర్ భవన్‌‌లో తెలంగాణ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ అధ్యక్షుడు డి.సుదర్శన్‌‌ బాబు అధ్యక్షతన డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా చెన్నూరు, ముషీరాబాద్‌‌ ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, ముఠా గోపాల్ హాజరయ్యారు. అనంతరం వివేక్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో కొత్తగా అంబేద్కర్ భవన్‌‌ను నిర్మిస్తామని మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌ హామీ ఇచ్చి, శంకుస్థాపన కూడా చేశారని గుర్తుచేశారు.

అయితే, ఇప్పటివరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఉపయోగించుకునేలా ఈ భవన్‌‌ను రెనొవేషన్‌‌ చేయిస్తామని వివేక్‌‌ తెలిపారు. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రాం, మహాత్మా జ్యోతిరావు ఫూలే వంటి మహనీయుల జీవిత చరిత్రను బహుజనులకు ఉపయోగపడేలా డైరీలో చక్కగా పొందుపర్చారని కొనియాడారు. అంతేకాకుండా చట్టాలు, ఎమ్మెల్యేల వివరాలు, అనేక జీవోలను ముద్రించడం.. వాటిని సులువుగా అర్థం చేసుకునే విధంగా డైరీ రూపంలో తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాగల నాగేశ్వరరావు, నరసింహారావు, దాసరి రవీందర్, రుద్రరం శంకర్, వినోద్ కుమార్, చెన్నకేశవరావు, దాసరి యాదగిరి, విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.