హైదరాబాద్, వెలుగు: మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి స్థాపించిన అంబేద్కర్ విద్యాసంస్థలు ‘ఇండియా టుడే’ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్గా నిలిచాయి. అంబేద్కర్ లా కాలేజీ.. రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. నేషనల్ లెవల్లో 65వ ర్యాంక్ సాధించి.. బెస్ట్ కాలేజీగా గుర్తింపు తెచ్చుకున్నది. దేశవ్యాప్తంగా వివిధ విద్యాసంస్థల్లోని వసతులు, టీచింగ్, చదువుకునే వాతావరణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ‘ఇండియా టుడే’ సంస్థ మంగళవారం ర్యాంకులను ప్రకటించింది.
ఇందులో డిగ్రీ, లా, ఇంజినీరింగ్, మెడిసిన్, డెంటల్ ఇలా పలు కేటగిరీల్లో బెస్ట్ సంస్థలకు ర్యాంకులు కేటాయించింది. దీంట్లో హైదరాబాద్ నగరంలోని బాగ్ లింగంపల్లిలో ఉన్న అంబేద్కర్ విద్యాసంస్థలు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించాయి. ప్రధానంగా లా కాలేజీల కేటగిరీలో రాష్ట్రంలోనే రెండో ర్యాంకు పొందగా, దేశవ్యాప్తంగా 65వ స్థానంలో నిలిచింది. బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ తదితర కోర్సుల్లోనూ అంబేద్కర్ విద్యాసంస్థలు మంచి ర్యాంకులు పొందాయి. అంబేద్కర్ కాలేజీ బీఏ కోర్సులో తెలంగాణలో ఏడో ర్యాంకు పొందగా, నేషనల్ లెవల్లో 111వ ర్యాంకు సాధించి సత్తా చాటింది.
బీబీఏ కోర్సులో రాష్ట్రంలో 9వ స్థానంలో నిలవగా, దేశవ్యాప్తంగా 195వ ర్యాంకు పొందింది. బీఎస్సీ కోర్సులో స్టేట్ లెవల్లో ఐదవ ర్యాంకు పొందగా, దేశవ్యాప్తంగా 108వ ర్యాంకు సాధించింది. బీకామ్ కోర్సు కేటగిరీలో రాష్ట్ర స్థాయిలో 12వ ర్యాంకుతో, దేశంలో 210వ ర్యాంకుతో అంబేద్కర్ కళాశాల బెస్ట్ కాలేజ్‌గా నిలిచింది. లా కాలేజీతో పాటు డిగ్రీ కాలేజీ.. వేర్వేరు కోర్సుల్లో మంచి ర్యాంకింగ్ తో అంబేద్కర్ విద్యాసంస్థలు క్వాలిటీ ఎడ్యుకేషన్‌కు వేదికగా మారాయని లెక్చరర్లు, స్టూడెంట్లు అభిప్రాయపడుతున్నారు.
