అంబేద్కర్ జయంతి.. పలు ప్రాంతాల్లో గొడవలు

అంబేద్కర్ జయంతి.. పలు ప్రాంతాల్లో గొడవలు

అంబేద్కర్ జయంతి సందర్భంగా పలు ప్రాంతాల్లో గొడవలు జరిగాయి. వేడుకలకు సరైన ఏర్పాట్లు చేయలేదని కొన్ని ప్రాంతాల్లో దళిత నేతలు ఆందోళన చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదంటూ ఎమ్మెల్యేలను నిలదీశారు కొందరు. మహబూబాబాద్  గిరిజన భవన్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. మైక్ సరిగా లేదంటూ మంత్రి సత్యవతి రాథోడ్ ముందు ఆందోళన చేశారు గిరిజన నేతలు. వేడుకలకు సరైన ఏర్పాట్లు చేయలేదని.. అంబేద్కర్ ను అధికారులు, ప్రజాప్రతినిధులు అవమానపరిచారంటూ మాలమహానాడు సంఘాల నేతలు ఫైరయ్యారు. దీంతో అధికారులపై మంత్రి సత్యవతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ సీఎం అయి ఏడేళ్లు అవుతున్నా.. ఏనాడూ అంబేద్కర్ కు పూలమాల వేసి నివాళులర్పించలేదంటూ భువనగిరిలో టీఆర్ఎస్ నేతలను నిలదీశారు దళిత సంఘాల నేతలు. వారిని ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అంబేద్కర్ జయంతి రోజు మాట్లాడే హక్కును కాలరాస్తున్నారని మండిపడ్డారు దళిత నేతలు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు దళిత సంఘాల నాయకులు.
 

వరంగల్ లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో MLA నన్నపనేని నరేందర్ ను నిలదీశారు ఐద్వా జిల్లా అధ్యక్షురాలు రత్నమాల. సమస్యలను చెప్పుకుందామని వెళ్తే.. ఎమ్మెల్యే ఎప్పుడూ ఒక్క నిమిషం సమయం ఇవ్వలేదన్నారు. ఎస్సీ హాస్టల్ సమస్యలను పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. అయితే సమస్యలు చెప్పడానికి ఇది సమయం కాదన్నారు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. ఎన్నిసార్లు కలిసి చెప్పినా పట్టించుకోలేదు కాబట్టే అందరి ముందు చెప్పాల్సి వచ్చిందన్నారు రత్నమాల. అధికారులు ఆమెను మాట్లాడకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో గందరగోళం ఏర్పడింది. జగిత్యాల జిల్లాలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో దళిత సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. వేదికపై కుర్చీలు వేసి తమను కింద కూర్చోబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అధికారుల తీరుకు నిరసనగా MRPS ధర్మపురి నియోజకవర్గం ఇంచార్జి రాజమని సభ నుంచి వెళ్లిపోయారు. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటు ఇతర నేతలు వేదిక నుంచి దిగి కింద కూర్చున్నారు.
 

భద్రాచలంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసే క్రమంలో ఘర్షణ జరిగింది. దళిత సంక్షేమ సంఘం నాయకుడు ముద్ద పిచ్చయ్య తన అనుచరులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. దీంతో విగ్రహం మొత్తం దండలతో నిండిపోయింది. ఎమ్మెల్యే పొదెం వీరయ్య వస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు పూలమాలలు,ఫ్లెక్సీలు తొలగించారు. అక్కడే ఉన్న దళితసంఘాల నాయకులు.. కాంగ్రెస్ నేతలలో వాగ్వాదానికి దిగారు. రౌడీయిజం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలపై దళిత నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా దళిత నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.